టీడీపీలో చల్లారని అసమ్మతి

20 Mar, 2019 17:16 IST|Sakshi
విజయజ్యోతి, లలిత కుమారి

సాక్షి, అమరావతి: ఎన్నికల సమీపిస్తున్నా టీడీపీలో అసమ్మతి చల్లారలేదు. టిక్కెట్‌ రాని నాయకులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. ఇక టీడీపీని వదిలి వెళ్లేవారు రోజురోజుకు పెరుగుతున్నారు.

సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనూ అస్మ​మతి కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా పూతల పట్టు నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. తనకు టిక్కెట్‌ ఇవ్వకపోవడంతో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి  చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్య అనుచరుల ఒత్తిడితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆమె నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీలో అవమానించారు
వైయస్సార్ జిల్లా బద్వేల్ టీడీపీ నాయకురాలు విజయజ్యోతి కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఇప్పటికే ఆమె ఎన్నికల ప్రచారం కూడా మొదలుపెట్టారు. టీడీపీలో ఉన్నంత కాలము తనను చిత్ర హింసలకు గురిచేశారని, అవమానించారని వాపోయారు. టీడీపీ మోసం చేయడంతో ఆ పార్టీని వదిలిపెట్టినట్టు చెప్పారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని చెబుతున్నారు.

సూరికి ఎదురుదెబ్బ
అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేతలు నాగశేషు, మద్దిలేటి, జయశ్రీ సహా 1500 మంది టీడీపీ కార్యకర్తలు బుధవారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వరదాపురం సూరి నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీకి వరప్రసాద్ గుడ్‌బై
గుంటూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, డీసీసీబీ బ్యాంక్ డైరెక్టర్ వరప్రసాద్ (బుజ్జి) బుధవారం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు డైరెక్టర్ పదవుకి రాజీనామా చేశారు. తాళ్లూరు సొసైటీ అధ్యక్షుడు బుజ్జి, మునుగోడు సొసైటీ మాజీ అధ్యక్షుడు చిట్టిబాబు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు