టీడీపీలో కలకలం

27 Jun, 2019 04:38 IST|Sakshi

ఢిల్లీలో బీజేపీ అగ్రనేతను కలసిన రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్‌ 

గరికపాటితో భేటీ కావడంతో పార్టీని వీడుతున్నట్లు ప్రచారం 

కమలం వైపు మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేల చూపు.. 

టీడీపీకి లంకా దినకర్‌ రాజీనామా.. బీజేపీలో చేరిక 

చంద్రబాబుతో భేటీకి పలువురు కాపు నేతలు గైర్హాజరు  

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి తేరుకోక ముందే వరుసగా తగులుతున్న షాక్‌లు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనం కాగా తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీకి చెందిన గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతతో సమావేశమై చర్చించడం, ఇటీవలే పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావును కలవడంతో కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితమే బీజేపీలో చేరిన గరికపాటి మోహనరావు ఆయన్ను దగ్గరుండి బీజేపీ అగ్రనేత వద్దకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. సత్యప్రసాద్‌తోపాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సత్యప్రసాద్‌ దీన్ని ఖండించారు.
 
పది రోజుల్లోపే మరికొందరు కూడా!
ఇటీవలే బీజేపీలో చేరిన చంద్రబాబు సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని బీజేపీలో చేర్చేందుకు సుజనా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి, విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కమలం గూటికి చేరుకోనున్నట్లు నాలుగు రోజులుగా టీడీపీలో ప్రచారం జరుగుతోంది. తాను బీజేపీలో చేరడం లేదని గంటా పైకి చెబుతున్నా మరికొందరు ఎమ్మెల్యేలను కూడగట్టి పార్టీని వీడేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీమోహన్, గద్దె రామ్మోహన్, మద్దాల గిరి తదితరులు కూడా టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారం పది రోజుల్లోనే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఏలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ, పామర్రు ప్రాంతానికి చెందిన టీడీపీ నేత కృష్ణబాబు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. 

బాబు వ్యూహాత్మక మౌనం
టీడీపీలో ఇంత జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన వ్యూహం ప్రకారమే సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లు బీజేపీలో చేరినట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినా స్పందించకపోవడం, అనర్హత వేటు వేయాలని డిమాండ్‌ చేయకపోవటాన్ని బట్టి ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతోందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. 

వ్యక్తిగత పనుల మీదే ఢిల్లీకి: ఎమ్మెల్యే సత్యప్రసాద్‌
సాక్షి, న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఖండించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వచ్చానని, ఈ విషయమై పార్టీ వర్గాలకు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి సన్నిహితుడైన గరికపాటి ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో పరామర్శించేందుకు వచ్చినట్టు తెలిపారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారడం సరికాదని, రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం వారి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించారు.

బీజేపీలో లంకా చేరిక 
టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ ఆ పార్టీకి రాజీనామా చేసి తాజాగా బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అవమానాలపై కాపు నేతల్లో ఆగ్రహం
టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు బుధవారం నిర్వహించిన సమావేశానికి తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ తదితరులు గైర్హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం ఈ వర్గం కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమై పార్టీలో తమ సామాజికవర్గానికి అవమానాలు జరుగుతున్నాయని, అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తమను పట్టించుకోలేదని, కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదనే అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి? టీడీపీలోనే కొనసాగితే తమ పరిస్థితి ఏమిటనే అంశంపై సమాలోచనలు జరిపారు. చంద్రబాబు భజన ఆపాలని తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. 

మరిన్ని వార్తలు