ఇక.. అక్క కాదు!

15 May, 2018 08:59 IST|Sakshi
దివాకరన్‌ ,శశికళ

మాజీ సహోదరి

‘అమ్మ’ హత్యకు మూడుసార్లుప్రయత్నాలుఆమెను రక్షించింది నేనే

ఆ ఇద్దరి వల్లే మన్నార్‌కుడి మాఫియా పేరు ఆ పేరుతో కుటుంబంలో నిత్యం వేదన

ఎవరికీ భయపడనూ.. తగ్గను

రాజకీయ పయనం కొనసాగుతుందన్న దివాకరన్‌

సాక్షి, చెన్నై : ‘‘ఇక శశికళను అక్కా అని పిలవను.. ఆమె మాజీ సహోదరి మాత్రమే.. అమ్మ జయలలిత హత్యకు మూడుసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఆమెను రక్షించింది నేనే.. ఆ ఇద్దరి వల్లే మా కుటుంబానికి మన్నార్‌ కుడి మాఫియా అనే పేరు వచ్చింది’’ అంటూ అమ్మ శిబిరం నేత దివాకరన్‌ సోమవారం  తీవ్రంగా స్పందించారు. ఎవరికీ తాను భయపడను అని, రాజకీయంగా తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. చిన్నాభిన్నంగా ఉన్న అన్నాడీఎంకేని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే దిశగా  రాజకీయ పయనం సాగించబోతున్నట్టు ప్రకటించారు.

దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశి కళ కుటుంబంలో బయలుదేరిన సమరం ముదిరి పాకాన పడింది. తన సోదరుడు దివాకరన్, అక్క వనితామణి కుమారుడు దినకరన్‌ మధ్య సాగుతున్న సమరంలో చిన్నమ్మ తీసుకున్న నిర్ణయం కుటుంబాన్ని రెండుగా చీల్చేసింది. తనకు వ్యతిరేకంగా శశికళ తీసుకున్న నిర్ణయంతో సోదరుడు దివాకరన్‌ షాక్‌కు గురయ్యారు. ఇక, ఆ కుటుంబం వేరు, తన కుటుంబం వేరు అని ప్రకటిస్తూ, శశికళను అక్క అని పిలవబోనని వ్యాఖ్యల తూటాల్ని పేల్చే పనిలో నిమగ్నం అయ్యారు.

ఇక, తెగ తెంపులు
మన్నార్‌కుడిలో తన మద్దతుదారులతో సమావేశం అనంతరం దివాకరన్‌ సోమవారం మీడియా ముందుకు వచ్చారు. న్యాయవాది ద్వారా నోటీసు పంపించి దినకరన్‌ బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాల్లో నిమగ్నం అయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కుటుంబ వివాదంలోకి మూడో వ్యక్తిని పంపించి ఆట మొదలెట్టారని, ఈ ఆటను రక్తికట్టించేందుకు తాను సిద్ధంగానే ఉన్నట్టు సవాల్‌ విసిరారు. శశికళ, దినకరన్‌లతో ఇక, తనకు ఎలాంటి సంబంధం లేదని, వారితో తెగదెపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు.

శశికళ ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఇక, ఆమెను అక్క అని పిలవకూడదని నిర్ణయించినట్టు తెలిపారు. దివంగత ఎంజీఆర్, అమ్మ జయలలితల మార్గదర్శకంలో తన రాజకీయ పయనం సాగుతుందన్నారు. దీనిని అడ్డుకునే రీతిలో ఎవరు వ్యవహరించినా.. అది శశికళ అయినా సరే, తిప్పి కొడుతానని హెచ్చరించారు. శశికళ ఫొటోలతో ఫ్లెక్సీలు వద్దని తాను ఎప్పుడో మద్దతుదారులకు తెలియజేశానని, అయితే, అత్యుత్సాహంతో కొందరుమాజీ సహోదరి ఫొటోలను వాడేశారని వ్యాఖ్యానించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా దినకరన్‌ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తొలుత ఓపీఎస్‌ను(డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం), ఆ తదుపరి ఈపీఎస్‌(సీఎం పళని స్వామి)ని శశికళకు దూరం చేశాడని, ఇప్పుడు తనను కూడా దూరం చేయించాడని శివాలెత్తారు.

రోగం ముదిరింది
సీఎం కావాలన్న ఆశతో దినకరన్‌ పగటి కలలు కంటూ, చివరకు మానసిక రోగి అయ్యాడని ఎద్దేవాచేశారు. నోటీసు అందుకున్న తాను, ఆగ్రహం తో శశికళకు వ్యతిరేకంగా తీవ్ర పదాల్ని, తీవ్ర ఆరోపణల్ని గుప్పిస్తానని దినకరన్‌ అనుకుని ఉంటాడని మండిపడ్డారు. అయితే, తాను అలాం టి పదాల్ని, ఆరోపణల్ని గుప్పించదలచుకోలేదని స్పష్టంచేశారు. అయితే, ఎన్నికల సమయంలో శశికళ పార్టీకి దినకరన్‌ ఉప ప్రధాన కార్యదర్శిగా ఉన్న పక్షంలో తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించి తీరుతానని తెలిపారు. తానేదో కేంద్రం ఆడిస్తున్నట్టుగా ఆడుతున్నట్టు దినకరన్‌ ఆరోపిస్తున్నాడని, వాస్తవానికి కేంద్రం అడుగులకు మడుగులొత్తుతున్నది అతడే అని ధ్వజమెత్తారు.

ఆ పేరుతో మనోవేదన
జయలలితకు దత్తపుత్రుడిగా తెరమీదకు వచ్చిన సుధాకరన్, దినకరన్‌ రూపంలో మన్నార్‌ కుడి మాఫియా అన్న పేరును తమ కుటుంబం మూటగట్టుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఆ పేరును తలచుకున్నప్పుడల్లా తాను తీవ్ర మనోవేదనకు లోనయ్యే వాడినని వ్యాఖ్యానించారు. శశికళకు తమ్ముడిగా ఉన్న ఒకే ఒక కారణంతో తానే కాదు, తన సన్నిహితులూ పలుమార్లు ఐటీ దాడుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. 33 సంవత్సరాలుగా మన్నార్‌కుడి మాఫియాకు తానేదో నేతృత్వం వహిస్తున్నట్టుగా అపవాదును భరించాల్సి వచ్చిందని ఉద్వేగానికి లోనయ్యారు. మన్నార్‌కుడిలో తానుక్కొడే ఉన్నానని, ఇతర కుటుంబీకులు ఎవరూ లేరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

సైదైతోనే విత్తనం
అన్నాడీఎంకే అన్న పేరుకు విత్తనం వేసిన వ్యక్తి సైదై దురై స్వామి అని వ్యాఖ్యానించారు. సత్య స్టూడియోలో ఎంజీఆర్‌ను కలిసి ఆ పేరును విత్తింది ఆయనే అని ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే, జయలలితను హతమార్చేందుకు మూడుసార్లు ప్రయత్నాలు జరిగా యని ఆరోపించారు. ఆ ప్రయత్నాల్ని తిప్పికొట్టి జయలలితను రక్షించింది తానేనని పేర్కొన్నారు. హతమార్చేందుకు ప్రయత్నించిందెవరో ..? అని ప్రశ్నించగా, దాటవేస్తూ, శశికళ కుటుంబం నుంచి తనను దూరం పెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇక, రక్త సంబంధీకులు మాత్రమే తనతో ఉన్నారని, ఉంటారని వ్యాఖ్యానించారు. శశికళకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశామని, ఆమె తమకు చుట్టం మాత్రమేనని, దినకరన్‌ అక్క కుమారుడైనా, తనకు సంబంధం లేని కుటుంబా నికి చెందిన వ్యక్తి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను మరణించినా, వారికి అంటు అనేది లేదని వ్యాఖ్యానించారు.

తనను మానసిక రోగిగా దినకరన్‌ వ్యాఖ్యానించాడని, అలాంటప్పుడు తనకు ఎందుకు నోటీసు పంపినట్టు అని ప్రశ్నించారు. చిన్నాభిన్నంగా ఉన్న అన్నాడీఎంకేని, కేడర్‌ను ఒకే గొడుగు నీడలోకి తీసుకొచ్చే దిశగా రాజకీయ పయనం సాగుతుందని, ఎవరికీ తాను భయపడనని, రాజకీయ పయనం ఆగదని స్పష్టం చేశారు. భేష్‌ తమిళనాడు ప్రభుత్వ పనితీరు అభినందనీయమని దివాకరన్‌ ప్రశంసించారు. డెల్టాలో జల వనరుల పరిరక్షణకు వెయ్యి కోట్లు కేటాయించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. కావేరి వ్యవహారం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ కోర్టు ధిక్కార కేసు సాహసోపేత నిర్ణయంగా కొనియాడారు. జయలలిత ప్రగతి పథకాలను సీఎం పళనిస్వామి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత్‌ను తమిళనాట సక్రమంగా అమలు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. డీఎంకే నేత స్టాలిన్‌ తన వ్యక్తిగత శ్రమతో ఎదిగారని కితాబు ఇవ్వడం గమనార్హం. 

మరిన్ని వార్తలు