లోక్‌సభ బరిలో జైపూర్‌ రాజకుమారి

7 Apr, 2019 13:04 IST|Sakshi

ఎంపీగా బరిలోకి దిగిన జైపూర్‌ రాజకుమారై దియా కుమారి

జైపూర్‌: బీజేపీ మాజీ ఎమ్మెల్యే, జైపూర్ మహారాజు భవానీ సింగ్ కుమార్తె దియా కుమారి ఈసారి లోక్‌సభ బరిలో నిలిచారు. రాజస్తాన్‌లోని రాజస్మాండ్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీచేస్తున్నారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శనివారం రాత్రి ఆమె పేరును అధికారికంగా ప్రకటించింది. జైపూర్ రాజకుమారి అయిన దియా 2014లో సవాయి మాధోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యేగా పోటీచేయట్లేదని వార్తలు వినిపించాయి.

లోక్‌సభ ఎన్నికల్లో దియాను రంగంలోకి దించాలనే ఉద్దేశ్యంతోనే బీజేపీ అధిష్టానం ఆమెను పోటీకి దూరంగా ఉంచిందన్న వార్తలు కూడా వచ్చాయి. రాజ్‌పుత్‌కు ప్రాభల్యం ఎక్కువగా ఉన్న రాజస్మాండ్‌లో దియాను పోటీలో నిలిపితే విజయం సాధించవచ్చన్న పక్కా వ్యూహంతోనే ఆమెను బరిలో నిలపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన దేవి నందర్‌ గుజ్జర్‌తో ఆమె పోటీపడనున్నారు. ప్రస్తుత బీజేపీ ఎంపీ హరిఓం సింగ్‌ ఆరోగ్యం అనుకూలించకపోవడంతో పోటీకి నిరాకరించారు. దీంతో ఆమె పోటీని లైక్‌ క్లియరైంది. దియాను అక్కడి నుంచి బరిలో నిలిపితే జైపూర్‌ పరిధిలోని రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా పార్టీకి మరింత బలం చేకూరుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు