మద్యాన్ని నిషేధించాలి

14 Dec, 2019 02:45 IST|Sakshi
డీకే అరుణకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేస్తున్న పరిపూర్ణానంద స్వామి

బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి

కవాడిగూడ: భావితరాల భవిష్యత్‌ కోసం మద్యపానాన్ని నిషేధించాలని బీజేపీ నాయకుడు పరిపూర్ణానంద స్వామి అన్నారు. భావితరాల్లో పెనుమార్పు కోసం కడుపు మాడ్చుకుని దీక్ష చేస్తే కానీ ప్రభుత్వానికి కనువిప్పు కలగదేమోనని వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో మద్యాన్ని నిషేధించాలంటూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ తలపెట్టిన 48 గంటల మహిళా సంకల్ప దీక్షను పరిపూర్ణానంద స్వామి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి దిశ పాపం తగలకుండా ఉండాలంటే మద్యపాన నిషేధం చేయాలని కోరారు.

ఎన్‌కౌంటర్‌ ప్రభుత్వం, పోలీసుల గొప్పతనం కాదు, ఇది ప్రజల తీర్పు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విడతల వారీగా మద్యాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. డీకే అరుణ చేస్తున్న దీక్ష బీజేపీ కోసం కాదని, ఇది తెలంగాణ మహిళల కోసం తలపెట్టిన దీక్షని అన్నారు. మద్యంతోపాటు డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మద్యం ఏరులైపాతుందని విమర్శించారు.

డీకే అరుణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యం నిషేధించలేరా అని ప్రశ్నించారు. దిశ సంఘటనతోనైనా సీఎంకు కనువిప్పుకలగాలని అన్నారు. దీక్షకు మాజీ మంత్రి ఇంద్రాసేనారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, గజ్జుల రామకృష్ణారెడ్డి, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ సంఘీభావం తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు