నగరం బ్రాందీ హైదరాబాద్‌గా మారింది!

12 Dec, 2019 13:12 IST|Sakshi

తెలంగాణ సర్కార్‌పై లక్ష్మణ్‌ మండిపాటుమద్యానికి వ్యతిరేకంగా డీకే అరుణ దీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సంకల్ప దీక్ష ప్రారంభించారు. రెండురోజులపాటు దీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను నియంత్రించి.. దశల వారీగా మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఈ దీక్షను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రారంభించారు. మద్యం వల్ల బాధితురాలైన వారి కుటుంబసభ్యులు సహా,  ఇటీవల ఆసిఫాబాద్‌ జిల్లాలో హత్యాచారానికి గురైన సమత భర్త, అత్త, పిల్లలు కూడా దీక్షలో పాల్గొన్నారు.

ఈ దీక్షలో డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. ‘ రాజకీయ కారణాలతో దీక్ష చేపట్టలేదు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. తండ్రి కొడుకుల వల్లే బ్రాండ్ హైదరాబాద్ కాస్తా బ్రాందీ హైదరాబాద్‌గా మారింది. రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చేశారు. మద్యం షాపులకు దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వం రూ. 980 కోట్ల ఆదాయం స్వీకరించింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాల ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతున్నా.. మద్యం అమ్మకాలు పెంచుకుంటూపోతున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మద్యం మత్తులో ముంచుతున్నారు. అర్ధరాత్రి మద్యం అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నారు. మద్యం నిషేధించాలని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. పల్లెల్లో బెల్ట్ షాపులను ద్వంసం చేయాలని మహిళా మోర్చా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం’ అని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా