బీజేపీకి 4 నుంచి 5 సీట్లు 

22 Mar, 2019 01:23 IST|Sakshi

మాజీ మంత్రి డీకే అరుణ 

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ నాలుగు నుంచి ఐదు ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని మాజీ మంత్రి డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. అరుణ తాజాగా బీజేపీలో చేరి మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ బండారు దత్తాత్రేయను ఆయన నివాసంలో కలుసుకుని ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్‌లో ఎన్నో గ్రూప్‌ల మధ్య పనిచేసిన తనకు బీజేపీలో కొనసాగడం కష్టమేమీ కాదని, పార్టీలో అందరినీ కలుపుకొనిపోతామని చెప్పారు. తనను టీఆర్‌ఎస్‌లోకి రమ్మని అడిగారని, అయితే ఆ పార్టీపై పోరాటం చేసిన తాను అందులో ఎలా చేరతానని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గౌరవంకన్నా ఎక్కువ గౌరవం తమ పార్టీ ఇస్తుందని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీ మారాక చాలామంది కాంగ్రెస్‌ నాయకులు ఫోన్‌ చేసి మంచి నిర్ణయం తీసుకున్నావని అభినందించారని అరుణ చెప్పారు.  

ఈ రోజు కాంగ్రెస్‌ పార్టీ బలహీన పడడానికి, నేతలు పార్టీలు మారడానికి పార్టీ పెద్దలే కారణమని, ఆ తప్పు, నేరం వారిదేనని అరుణ అన్నారు. గతంలో జనతాదళ్‌ను మూయించిన జైపాల్‌రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీని కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను పీసీసీ చీఫ్‌ పదవికి పోటీపడినప్పటి నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనపై కక్ష కట్టారని అరుణ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో తనకు వ్యతిరేకంగా వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, చిన్నారెడ్డిలతో ఉత్తమ్‌ గ్రూప్‌ తయారు చేశారని, వారితో తనకు వ్యతిరేకంగా మాట్లాడించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీని ఉత్తమ్‌ తన ఇంటి పార్టీ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. జైపాల్‌రెడ్డి ఒక మేధావి.. ఆయన సలహాలతో ఉత్తమ్‌ పనిచేస్తారన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలపుడు టీడీపీతో పొత్తు వద్దని తాను చెప్పినా పార్టీ నేతలు పట్టించుకోలేదని ఆమె తెలిపారు.


 

మరిన్ని వార్తలు