నీకు మాత్రం పోలీస్ భద్రత ఎందుకు?

2 Dec, 2019 19:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దిశ ఘటన యావత్తు దేశాన్ని ఒక్కసారి ఉలిక్కి పడేలా చేసిందని బీజేపీ మహిళ నాయకురాలు డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ మహిళ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ నిర్భయ ఘటన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకురాలు డీకే అరుణ, మహిళ మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, మహిళ మోర్చా నేతలు హాజరయ్యారు. ఓ వైపు మహిళా సాధికారత కోసం పరుగులు తీస్తుంటే మరోవైపు ఎందరో అమాయక మహిళలు బలైపోతున్నారని ఆందోళన చెందారు. వయస్సుతో సంబంధం లేకుండా మహిళలపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారని, అన్ని రంగాల్లో వెక్కిలి మాటలు, వెర్రి చేష్టలు ఎక్కువయ్యయన్నారు. సంస్కారం నేర్పని చదువులు ఎందుకని నిలదీశారు. చదువు లేదనో, కులం తక్కువనో, వెనుకబడ్డ వారు అన్న ఉద్దేశ్యంతో ఇలాంటి ఘటనలు చేసిన వారిని పాపం అనకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసింది ఎవరైనా నిందితులకు శిక్ష పడాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కొన్ని రోజులు బాధపడి ఆ తర్వాత తేలిగ్గా తీసుకోవడం సరికాదన్నారు.

అలాగే.. దిశ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించకపోవడం, కనీసం పలకరించకపోవడం దారుణమన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని, హోంశాఖ మంత్రి మహ్మద్‌ అలీ వ్యాఖ్యలు దారుణమన్నారు. ఇంటికో పోలీస్‌ను పెట్టాలా అని తలసాని అంటున్నారు. నీ ఇంటి చుట్టూ అయితే 100 మంది పోలీసులు ఉండాలా అని ప్రశ్నించారు. అవసరం ఉన్న చోట ఒక్క పోలీసు కూడా ఉండరని విమర్శించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడే తీరిక కూడా కేసీఆర్‌కు లేదని దుయ్యబట్టారు. ‘నిందితులకు శిక్ష పడాలి అంటే చేయాల్సింది ట్వీట్ కాదు. న్యాయం జరగాలి అంటే సమస్య తీవ్రత వివరించాలి’ అంటూ కేటీఆర్‌ను ఉద్ధేశించి హితవు పలికారు. వరంగల్‌లో జరిగిన న్యాయం చాలా రోజులు గుర్తున్నాయని ఆమె తెలిపారు. చట్టాలు సవరించాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రుల పెంపకంలోనూ మార్పు రావాలని డీకే ఆరుణ సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మహిళ కమిషన్ లేకపోవడం దారుణమని బీజేపీ మహిళ మోర్చా అధ్యక్షురాలు  ఆకుల విజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖ మంత్రి మాట్లాడిన మాటలు సిగ్గుచేటని అన్నారు.

చదవండి : ప్రియాంక చిన్న పొరపాటు వల్లే: మహమూద్‌ అలీ

 మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం: గీతారెడ్డి

  


 

మరిన్ని వార్తలు