ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎన్నడూ రాలేదు : కోదండరామ్‌

24 Jan, 2019 13:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఇందిరా పార్కు వద్ద నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ నంది ఎల్లయ్య, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషా, మాజీ మంత్రులుమర్రి శశిధర్ రెడ్డి, డీకే అరుణ, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. అసెంబ్లీని రద్దు చేసి సీఎం కేసీఆర్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడం చూస్తే ఎన్నికల కమిషన్‌, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కైన విషయం స్పష్టమైందని అన్నారు. తమతో చేతులు కలపడం వల్లే సీఎం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారని ఆరోపించారు. ‘ఓట్ల గల్లంతుపై ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు.. తీరా ఎన్నికలు అయినా తర్వాత రజత్ కుమార్ క్షపణలు చెప్పారు. ఎన్నికల్లో కూడా పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్య ఓట్ల తేడా వచ్చింది. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలి. ఫలితాలకు ముందే ఇన్ని సీట్లు గెలుస్తామంటూ ప్రకటించుకున్న టీఆర్‌ఎస్‌ అదేవిధంగా అన్ని సీట్లను గెలవడం పట్ల అందరికి అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎన్నడూ రాలేదు : కోదండరామ్‌
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ సొంత పనులకు వాడుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని డబ్బులు పంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాను సవరించుకుంటామని ఎన్నికల సంఘం చెప్పింది.. అయినా అసెంబ్లీ ఎన్నికలో 22 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతయ్యాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్లను తీసుకవచ్చారు. అభ్యర్థులకు అనుమానాలు ఉన్నచోట వాటిని లెక్కించాల్సింది.. ఈ విషయంలో ఈసీ రజత్ కుమార్ వ్యవహార శైలిపై అందరికి అనుమానాలు నెలకొన్నాయన్నారు. రజత్ కుమార్‌పై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో అవకతవకలను అరికట్టాల్సింది ఎన్నికల సంఘం.. అలాంటిది వారే కంచే చేను మేసినట్లు ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. ఎన్నికల సంఘం మీద ఇప్పటి వరకు ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎన్నడూ రాలేదని అన్నారు.

మరిన్ని వార్తలు