సర్జికల్‌ స్ట్రైక్స్‌పై మాట్లాడను.. ఆమెకు టికెట్‌ కష్టమే!

27 Feb, 2019 08:28 IST|Sakshi

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌

సాక్షి, బెంగళూరు : జైషే ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌పై తానేమీ మాట్లాడనని కర్ణాటక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ అన్నారు. ఈ విషయాల గురించి తమ పార్టీ పెద్దలు మాత్రమే మాట్లాడుతారని పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేయడానికి మంగళవారం ఆయన బళ్లారిలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారత సైనికులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. అయితే పాక్‌ ఉగ్రవాదులపై దాడి గురించి తాను స్పందించనని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నందున ప్రజలే నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు.

సుమలత ఆశ వదులుకోవాల్సిందే!
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బళ్లారితో పాటు రాష్ట్రంలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుస్తుందని శివకుమార్‌ ధీమా వ్యక్తం చేశారు. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి దివంగత సినీ నటుడు అంబరీష్‌ సతీమణీ సుమలతకు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కే అవకాశం దాదాపు లేదని స్పష్టం చేశారు. కూటమి సర్దుబాటులో భాగంగా ఈ స్థానాన్ని జేడీఎస్‌కు వదిలివేసే అవకాశం ఉందన్నారు.  ఈ నేపథ్యంలో ఆ సీటుపై సుమలత ఆశలు వదులుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. అయితే పార్టీలో ఆమెకు తగిన ప్రాతినిథ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.(చదవండి : బరిలో మనవళ్లు.. ఢీ అంటే ఢీ?!)

మరిన్ని వార్తలు