మోదీ సభ: బీజేపీ కూటమిలోకి విజయ్‌కాంత్‌

6 Mar, 2019 15:47 IST|Sakshi

అన్నాడీఎంకే, బీజేపీతో చేతులు కలిపిన డీఎండీకే

సాక్షి, చెన్నై: పొత్తుల పరంగా తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమితో నటుడు కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే చేతులు కలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కంచీపురంలో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో అన్నాడీంఎకే-బీజేపీ కూటమిలో డీఎండీకే చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

తమ కూటమిలో డీఎండీకే చేరిన విషయాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి ధ్రువీకరించారు. రానున్న ఎన్నికల్లో మొత్తం నాలుగు పార్టీలు (అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే) కూటమిగా పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. విజయ్‌కాంత్‌ సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలతతోపాటు పలువురు నేతలు సీఎం నివాసంలో పళనిస్వామిని కలిశారు. మరోవైపు ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో వేదికపై ఏర్పాటు చేసిన పోస్టర్‌లో ప్రధాని మోదీ, సీఎం పళనిస్వామితోపాటు విజయ్‌కాంత్‌ చిత్రం కూడా ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో కొత్తగా చేరిన డీఎండీకేకు నాలుగు నుంచి 5 లోక్‌సభ స్థానాలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌-డీఎంకేలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో చేరేందుకు డీఎండీకే ఆసక్తి చూపించినా.. మిత్రపక్ష పార్టీల కోసం మరిన్ని సీట్లు వదులుకోవడానికి డీఎంకే నిరాకరించడంతో ఇది సాధ్యపడలేదని తెలుస్తోంది. తమిళనాడులోని 39స్థానాల్లో బీజేపీకి ఐదు, పీఎంకేకు ఏడు స్థానాలను అన్నాడీఎంకే ఇప్పటికీ ఖరారు చేసింది.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు