నడిరోడ్డుపై ప్రజా ప్రతినిధుల కొట్లాట..

24 Feb, 2019 14:50 IST|Sakshi

సాక్షి, చెన్నై : తమిళనాడులో అధికార, ప్రతిపక్ష పార్టీ వర్గీయులు నడిరోడ్డుపై బాహీబాహీకి దిగిన సంఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. అందులోనూ ఇరు పార్టీలకు చెందిన ఎంపీ, జిల్లా కార్యదర్శి రోడ్డుపై కొట్టుకోవటం తిరుచ్చి జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే... తిరుచ్చి జిల్లా పొన్మలైలో బస్టాండ్ షెల్టర్‌ నిర్మాణం చేపట్టాలంటూ ప్రజలు గత ఐదేళ్లుగా స్థానిక అన్నాడిఎంకె ఎంపీ కుమార్‌ను కోరుతున్నారు. అయితే ఆయన వద్ద నుండి స్పందన రాకపోవటంతో స్థానిక డీఎంకె ఎమ్మెల్యే అన్బిల్ మహేష్ తన నిధులతో బస్టాండ్ నిర్మించారు. ఈ బస్టాండ్ భవనం ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు స్థానిక డీఎంకే కార్యకర్తలు హాజరయ్యారు. 

ఈ సమాచారం తెలుసుకున్న ఎంపీ కుమార్ కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకుని బస్టాండ్‌ షెల్టర్‌ను ప్రారంభించటానికి వీలులేదని డీఎంకే వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల నడుమ ఘర్షణ తలెత్తింది. దీంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రెచ్చిపోయి షెల్టర్‌ను కూల్చివేయడమే కాకుండా డీఎంకే వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా అన్నాడీఎంకే ఎంపీ కుమార్, డీఎంకే జిల్లా కార్యదర్శి, ఇరువర్గాల కార్యకర్తలు రోడ్డుపైనే కొట్టుకున్నారు. 

అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు నడిరోడ్డుపై రౌడీల్లా కొట్టుకోవటం ఇప్పుడు తమిళనాట సంచలనం సృష్టిస్తుంది. రెండుసార్లు ఎంపీగా ఉన్న కుమార్ తమ ప్రాంతానికి ఎటువంటి సాయం చేయకపోగా డీఎంకే చేస్తున్న సాయాన్ని అడ్డుకోవటంతోపాటు వారిపై దాడులకు పాల్పడటంపై స్థానిక ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అధికార బలంతో అన్నాడీఎంకే వర్గీయులు ఇటువంటి దాడులకు పాల్పడటంపై భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు