బండ్ల గణేశా.. టికెట్‌ దక్కెనా?

14 Nov, 2018 12:05 IST|Sakshi
బండ్ల గణేశ్‌

రెండు జాబితాల్లో కనిపించని బండ్ల గణేశ్‌ పేరు

ఆసక్తి రేపుతున్న రాజేంద్రనగర్‌

ఆశావాహుల్లో ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌ : పవన్‌ కల్యాణ్‌ వీరాభిమానిగా చెప్పుకునే సినీ నిర్మాత బండ్ల గణేశ్‌.. అనూహ్యంగా కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. పలు టీవీ చానళ్లలో హడావుడి చేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో పోటీచేస్తున్నానని, రాజేంద్ర నగర్‌ టికెట్‌ తనదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని జోస్యం కూడా చెప్పారు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనకు పెద్ద షాక్‌ ఇచ్చింది. సుదీర్ఘ కసరత్తుల అనంతం అర్థాత్రి విడుదల చేసిన తొలి జాబితాలోను.. తాజాగా 10 మందితో ప్రకటించిన రెండో జాబితాలోను అతని పేరును ప్రకటించలేదు. అంతేకాకుండా గణేష్‌ ఆశిస్తున్న రాజేంద్ర నగర్‌ స్థానాన్ని పెండింగ్‌లో ఉంచింది. (చదవండి: కాంగ్రెస్‌ రెండో జాబితా)

గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ బరిలోకి దిగి గెలిచారు. అనంతరం ఆయన టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. ఇక మహాకూటమిలో మిత్రపక్షమైన టీడీపీ తమకే ఆ టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతోంది. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడు కార్తిక్‌ రెడ్డికి ఈ స్థానం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఫ్యామిలీకి ఒకే టికెట్‌ సిద్ధాంతమన్నా కాంగ్రెస్‌.. ఇప్పటికే ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, కోమిటి రెడ్డి బ్రదర్స్‌, మల్లు బ్రదర్స్‌లకు టికెట్లు ఇచ్చింది. దీంతో ఆమె ఈ టికెట్‌ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. మరి అధిష్టానం బండ్ల గణేశ్‌కు అవకాశం ఇస్తుందా..? లేక టీడీపీకి వదిలేస్తుందో వేచి చూడాల్సిందే.  ఎన్నికల నగార మోగినప్పటి నంచి హడావుడి చేస్తున్న బండ్ల గణేశ్‌కు టికెట్‌ దక్కపోతే పరిస్థితి ఏంటని.. ఆయన రాజకీయాల్లో కొనసాగుతాడా? లేక ఇతర పార్టీలవైపు చూస్తాడా? అనే చర్చ జోరు అందుకుంది. (చదవండి: 65 మందితో కాంగ్రెస్‌ తొలి జాబితా)

మరిన్ని వార్తలు