అవసరమైనప్పుడు ఎక్కడున్నారు సార్‌?

24 Mar, 2019 08:46 IST|Sakshi

సాక్షి, ఎలక్షన్‌ డెస్క్‌: ‘‘ఏమిటి సుందరయ్య గారూ.. టీవీలో ఏదో చూస్తూ మీలో మీరే నవ్వుకుంటున్నారు?’’ అడిగాడు పొరుగింటి పరంధామయ్య. 
‘‘ఏమీ లేదు లెండి. ఏదో కథ గుర్తొచ్చి...’’ 
‘‘ఏమిటా కథ?’’
‘‘అప్పట్లో సోముడు అనేవాడు రాముడి దగ్గర వెయ్యి వరహాలు అప్పు తీసుకున్నాట్ట. బాకీ ఎప్పుడు తీరుస్తావని అడిగితే, సంతకెళ్లి సరుకులమ్మాక ఇస్తానన్నాట్ట. తీరా ఇద్దరూ సంతకెళ్లి వస్తువులు అమ్మాక.. అంత సొమ్ము అప్పనంగా అవతలి వాడి చేతిలో పెట్టడం ఎందుకు అనిపించిందట సోముడికి.
‘సరుకులమ్మగానే బాకీ తీరుస్తానన్నావు కదా’ అని రాముడు అడిగితే ‘ఇప్పుడే కదా అమ్మాను. ఇంట్లోకి సరుకులు ఇవీఅవీ తీసుకోవాలి కదా. ఇంటికెళ్లాక ఇస్తాన్లే’ అన్నాట్ట. సరేనన్నాడు రాముడు. ఇంతలో ఇంటికెళ్లే సమయంలో అడవి దాటుతున్నప్పుడు దొంగలు ఎదురుపడ్డారట. వెంటనే సోముడు.. ‘ఇందాక అప్పు తీర్చమని అడిగావు కదా. ఇంద తీసుకో’ అంటూ బాకీ సొమ్ము రాముడి చేతిలో పెట్టాడట. ఈ కథ గుర్తొచ్చి నవ్వాను’’ అన్నాడు సుందరయ్య.
‘‘ఇంతకీ ఈ కథ ఎందుకు గుర్తొచ్చింది?’’
‘‘ఏమీ లేదు.. ఇందాక మన బాబుగారి ఎన్నికల యాడ్‌ టీవీలో వచ్చింది. ‘నేను మీ ఇంటి పెద్ద కొడుకును. మీ అవసరాలన్నీ తీరుస్తా. మీకు వైద్యానికయ్యే ఖర్చులన్నీ ఇస్తా’ అంటూ ఏదో చెబుతుంటే ఈ కథ గుర్తొచ్చింది’’ 
‘‘బాబుగారి ఎన్నికల యాడ్‌కీ, మీరు చెప్పిన కథకూ సంబంధం ఏమిటి?’’ 
‘‘అప్పట్లో మొత్తం రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. ఆ తర్వాత వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌లో కొంత మొత్తం మాత్రమే అన్నాడు. ఈ రెండు క్లిప్పింగుల ఫుటేజ్‌లూ సోషల్‌ మీడియాలో తెగ తిరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఇంటి పెద్దకొడుకునూ.. ఇంటిల్లిపాదికీ వైద్యం ఖర్చులిస్తానంటుంటే.. ఆ కథ గుర్తొచ్చింది. కథలో సోముడూ అంతే. అవసరమైనప్పుడు డబ్బులివ్వడు. దొంగలు దోచుకునే టైమ్‌కు బాకీ తీర్చేస్తానంటాడు. సోముడు అంటూ చంద్రుడి పేరు పెట్టుకున్నందుకు అచ్చం మన బాబుగారిలాగే వ్యవహరించాడు కదా కథలోని వాడు అని నవ్వాను’’ అన్నాడు సుందరయ్యా. 
‘‘ఏమో ఈసారి ఇచ్చేస్తాడేమో లెండి’’ అన్నాడు పరంధామయ్య. 
‘‘మీరుత్తి అమాయకులండీ. అప్పట్లో ఆరోగ్యశ్రీ స్కీము బాగానే నడుస్తోంది. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నారు. కాబట్టి అప్పట్లో అక్కడి ఏ హాస్పిటల్‌కు వెళ్లినా అది వర్తించింది. కానీ మనవాడు ఓటుకు నోటు కేసులో పట్టుబడి,  కరకట్టకు పరుగు పరుగున వచ్చేశాడు చూడండీ.. సరిగ్గా అప్పట్నుంచే హైదరాబాద్‌ హాస్పిటల్‌ వాళ్లూ ఆంధ్రప్రదేశ్‌ పేషెంట్లను తీసుకోవడం మానేశారు. అదేమిటంటే.. ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ డబ్బులివ్వటం లేదు. అక్కడిది ఇక్కడ నడవదు’ అనడం మొదలుపెట్టారు. ఈయన డబ్బు ఇస్తే వాళ్లెందుకు వైద్యం చేయరండీ. మరి ఆయనకు అంత చిత్తశుద్ధి అప్పుడే ఉంటే.. ఇప్పటికి ఎంత మందిని కాపాడి ఉండేవాడూ.. ఎన్ని ప్రాణాలు నిలిచేవి. చక్కగా అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీని నిలబెట్టలేనివాడు, మళ్లీ ఇప్పుడొచ్చి మళ్లీ పెద్దకొడుకునూ, పెద్దదిక్కునూ అప్పటి స్కీమును మళ్లీ ఇప్పుడు కొత్తగా అమలు చేస్తానంటుంటే ఎలా నమ్మగలమా అనిపిస్తోంది. వైఎస్‌ గారు ఆ స్కీమునెలా నడిపించారో మనకు తెలియనిదా అండీ’’ 
‘‘అవున్లెండి. కొంతమంది పెద్దకొడుకులంతే. అసలు టైమ్‌లో అవసరానికి దొరక్కుండా పోతారు. సరిగ్గా ఆస్తి పంపకాలప్పుడు పెద్దవాణ్ణీ, పెద్ద వాటా కావాలంటూ పేచీలు పెడతారు. అచ్చం.. మన బాబుగారిలాగే’’ నిట్టూర్చారిద్దరూ. 
- యాసిన్‌ 

మరిన్ని వార్తలు