మాలిక్‌ నియామకం వెనక మతలబేమిటీ?

25 Aug, 2018 15:12 IST|Sakshi
సత్యపాల్‌ మాలిక్‌

సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌ 13వ రాష్ట్ర గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌ గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. పౌర అధికారులను, మాజీ సైనిక అధికారులను రాష్ట్ర గవర్నర్‌గా నియమించే సంప్రదాయానికి తెరదించి ఓ రాజకీయ అనుభవశాలిని గవర్నర్‌గా నియమించడం విశేషం. 1965లో తొట్టతొలి గవర్నర్‌గా కరణ్‌ సింగ్‌ నియామకం అనంతరం ఓ రాజకీయ వ్యక్తిని నియమించడం మళ్లీ ఇదే తొలిసారి. ప్రస్తుతం గవర్నర్‌ పాలనలో ఉన్న కశ్మీర్‌కు సత్యపాల్‌ మాలిక్‌ను నియమించడం పట్ల రాజకీయ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కశ్మీర్‌ సమస్యకు ఇంతకాలం సైనిక పరిష్కారాన్నే కోరుకున్న కేంద్రం వైఖరిలో వచ్చిన మార్పునకు ఇది సూచనని, రాజకీయ కోణం నుంచి కశ్మీర్‌ సమస్యను చూసేందుకు రాజకీయ అనుభవశాలిని నియమించారని ఎక్కువ మంది భావిస్తున్నారు.
 
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 72 ఏళ్ల మాలిక్‌ కొన్ని దశాబ్దాల తన రాజకీయ జీవితంలో పలు పార్టీలు మారారు. మాలిక్‌తోపాటు పలు పార్టీలకు సేవలిందించి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న కేసీ త్యాగి కథనం ప్రకారం మాలిక్‌ ‘సోషలిస్ట్‌’గా మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి. ప్రస్తుతం జనతాదళ్‌ (యూ)లో కొనసాగుతున్న ఆయన మీరట్‌లో సోషలిస్ట్‌ యువజన నాయకుడిగా పనిచేశారు. భారత్‌తో సోషలిస్ట్‌ ఉద్యమాన్ని తీసుకొచ్చిన రామ్‌ మనోహర్‌ లోహియా, కశ్మీర్‌కు చెందిన షేక్‌ మొహమ్మద్‌ అబ్దుల్లాలతో స్ఫూర్తి పొందిన వ్యక్తి. సత్ప్రవర్తన కలిగిన మాలిక్‌ ఏ పార్టీలో కూడా తన పని విధానంలో చెడ్డ పేరు తెచ్చుకోలేదు. ఆయన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి లోక్‌దళ్‌ పార్టీ తరఫున 1974లో ఎన్నికయ్యారు. 1980లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1984లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1985లో యూపీ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1986లో మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

1987లో ఆయన వీపీ సింగ్‌ నాయకత్వంలోని జన్‌మోర్చాలో చేరారు. జన్‌మోర్చా జనతా దళ్‌లో విలీనమైన తర్వాత 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వీపీ సింగ్‌తో విభేదించి సమాజ్‌వాది పార్టీలో చేరారు. 2004లో బీజేపీలో చేరారు. 2017లో బిహార్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. వీపీ సింగ్‌ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు జనతాదళ్‌లో మాలిక్, త్యాగీలు కలసి పనిచేశారు. అప్పుడు కశ్మీర్‌ సమస్య పట్ల వీపీ ప్రభుత్వం దృక్పథం భిన్నంగా ఉండేదని, ఒక్క చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించకోగలమని కేంద్రం బలంగా విశ్వసించిందని త్యాగి తెలిపారు.

సోషలిస్ట్, ఆపార రాజకీయ అనుభవం కలిగిన మాలిక్‌ను కశ్మీర్‌ గవర్నర్‌గా నియమించడం కశ్మీర్‌ రాజకీయ పార్టీల్లో కొత్త ఆశలు చిగురింపచేశాయి. కశ్మీర్‌కు ఇది మరో ప్రయోగం లాంటిదేనని, అయితే రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని నియమించడం మంచి ప్రత్యామ్నాయం అని, సమస్యను అర్థం చేసుకొని పరిష్కార మార్గం కనుగొనే అవకాశం ఉంటుందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ లెజిస్లేచర్‌ అలీ మొహమ్మద్‌ సాగర్‌ అభిప్రాయపడ్డారు. కేంద్రం ఇష్టప్రకారమే ఈ నియామకం జరిగి ఉన్నట్లయితే మాలిక్‌ నియామకాన్ని హర్షించాల్సిందేనని ఆయన అన్నారు. సైనికేతర వ్యక్తిని నియమించడం పట్ల పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ బహిరంగంగానే హర్షం వ్యక్తం చేసింది. సత్ఫాలన అందించడంతో పాటు అన్ని పార్టీలను కలుపుకొని కశ్మీర్‌ సమస్య పరిష్కారం దిశగా మాలిక్‌ ముందడుగు వేస్తారని ఆ పార్టీ అదనపు అధికార ప్రతినిధి నజ్మూ సాకిబ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్న 35ఏ, 370 అధికరణలను ఎత్తివేయకుండా అడ్డుకుంటారన్న ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. మాలిక్‌ నియామకం సరైందన్న రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ మాలిక్‌ కశ్మీర్‌ పట్ల పాక్‌ దృక్పథం మారిందనే అభిప్రాయంతోని ఏకీభవించలేదు.

మాలిక్‌ నియామకాన్ని మామూలు విషయంగా తీసుకోకూడదని, ఇందులో కచ్చితంగా ఏదో మతలబే ఉంటుందని బీజేపీ నైజం బాగా తెల్సిన రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మాలిక్‌ సేవలను ఉపయోగించుకునే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్రం కృషి చేయవచ్చని వారు భావిస్తున్నారు. కశ్మీర్‌ సమస్యకు రాజకీయ పరిష్కారానికి తాము వెరవమని చెప్పడానికి, మరోరకంగా రాష్ట్రంలో పార్టీ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసమే మాలిక్‌ను కేంద్రం నియమించి ఉంటుందని కశ్మీర్‌ యూనివర్శిటీలోని పొలిటికల్‌ సైన్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఐజాజ్‌ వాణి అభిప్రాయపడ్డారు. అధికార రాజకీయాల కోసమే కేంద్రం ప్రయత్నించినట్లయితే కశ్మీర్‌ పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం ఉందని కూడా ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు