కుల రాజకీయాలు మంచివి కావు  

19 Jan, 2020 02:01 IST|Sakshi
సిరిసిల్ల రోడ్‌ షోకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కేటీఆర్‌

బీజేపీది పని తక్కువ.. బిల్డప్‌ ఎక్కువ 

కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏం లాభం? 

సిరిసిల్ల, వేములవాడల్లో కేటీఆర్‌ రోడ్‌ షో 

సిరిసిల్ల: ఎన్నికలప్పుడు కులం, మతం పేరిట రాజకీయాలు చేయడం మంచిది కాదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం రోడ్‌ షోలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ దేశం అబ్బురపడేలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అ«ధికారంలోకి వచ్చాక గోదావరి జలాలు బీడు భూములకు చేరాయని, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్లు, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, కంటి వెలుగు, ఆసరా వంటి అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ లొల్లి ఎక్కువ అని, పని తక్కువ అని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని నీతి ఆయోగ్‌ సంస్థ రూ.14 వేల కోట్లు ఇవ్వాలని సూచిస్తే.. ఐదు పైసలు ఇవ్వలే దని కేటీఆర్‌ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరినా కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో లేదని ఆ పార్టీకి ఓట్లు వేసిన లాభం లేదన్నారు. 

పని చేయకుంటే పీకి పారేస్తాం 
కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని కేటీఆర్‌ అన్నారు. ప్రజలతో ఓట్లు వేయించుకుని పదవుల్లోకి వచ్చిన వారిని విధులు, నిధులపై అవగాహన కల్పిస్తామని, పట్టణాల్లో పారిశుధ్యం, పచ్చదనంపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఎవరైనా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పని చేయకుంటే పదవుల నుంచి పీకి పారేస్తామన్నామని కేటీఆర్‌ హెచ్చరించారు. పనిచేయని అధికారులపైన చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే నాలుగేళ్లలో ఎలాంటి ఎన్నికలు లేవని, పురపాలన, పరిపాలనపైనే దృష్టి సారిస్తామని తెలిపారు. మున్సిపాలిటీలకు నెలకు రూ.216 కోట్లు ఇస్తామని, పల్లె ప్రగతి లాగే పట్టణ ప్రగతి చేపడుతామని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల రూపురేఖలు మారుస్తామని, దేశంలోనే తెలంగాణ పట్టణాలు అగ్రభాగాన ఉండేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేస్తేనే కేసీఆర్‌కు వేసినట్లని మంత్రి గుర్తు చేశారు. కులం, మతం పేరిట రాజకీయాలు చేసే వారికి గుణపాఠం చెప్పాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  

ఎన్నికల రోజు ఉండను 
మున్సిపల్‌ ఎన్నికలు జరిగే రోజు తాను దేశంలో ఉండటం లేదని కేటీఆర్‌ అన్నారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్తున్నానని వెల్లడించారు. ఆఖరి రోజుల్లో ఆగం ఎక్కువ చేస్తారని, ఎవరూ ఆగం కాకుండా కారు గుర్తుకు ఓట్లు వేయాలని కోరారు. గాడిదకు గడ్డి వేసి ఆవుకు పాలు పిండితే రావని , అధికార పార్టీకి ఓట్లు వేసి ఆశీర్వదించాలని కేటీఆర్‌ కోరారు. వేములవాడలో ఎమ్మెల్యే రమేశ్‌బాబు, సిరిసిల్లలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దీపంతో మహమ్మారిని ఎలా ఆపుతారు?

టార్చిలైట్లు వేసినంత మాత్రాన..

'బాబు.. నీ బోడి సలహాలు అవసరం లేదు'

ముందుచూపు లేని మోదీ సర్కారు

ఏడాది కింద కరోనా వచ్చుంటేనా..

సినిమా

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్