ఠాక్రే నుంచి నేర్చుకోవాల్సిన అగత్యం లేదు!

26 May, 2018 19:41 IST|Sakshi

లక్నో: తనను చెప్పుతో కొట్టాలనిపించిందంటూ శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. మరాఠా యోధుడు చత్రపతి శివాజీ ఫొటోకు యోగి చెప్పులు ధరించి పూలమాల వేయడాన్ని ఠాక్రే తప్పుబట్టారు. నివాళులు అర్పించే విషయంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసునని, ఈ విషయంలో ఉద్ధవ్‌ నుంచి మర్యాద, సంస్కారం నేర్చుకోవాల్సిన అగత్యం తనకు పట్టలేదని యోగి అన్నారు.

‘ఉద్ధవ్‌ ఠాక్రేకు నిజమేమిటో తెలియదు. ఉద్ధవ్‌ నుంచి మర్యాదలు నేర్చుకోవాల్సి అగత్యం నాకు పట్టలేదు. ఆయన కన్నా నాకు ఎక్కువ సంస్కారం, మర్యాదలు తెలుసు. నివాళులు ఎలా అర్పించాలో నాకు తెలుసు.  ఆ విషయంలో ఆయన నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు’ అని యోగి అన్నారు. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ), శివసేనల మధ్య మాటలయుద్ధం రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. పాల్ఘడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఫడ్నవీస్‌ ఆడియో టేపులను శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే విడుదల చేశారు. ఆ టేపులో ఎన్నికల్లో గెలిచేందుకు ఎంతకైనా తెగించాలని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ చేసిన వ్యాఖ్యలున్నాయి. అవి దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో యూపీ సీఎం యోగిని ఓ భోగి అని సంభోదిస్తూ ఉద్ధవ్‌ ఠాక్రే యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరాఠా యోధుడు చత్రపతి శివాజీ ఫొటోకు యోగి చెప్పులు ధరించి పూలమాల వేయడాన్ని ఠాక్రే తప్పుబట్టారు. ‘అది చూశాక అవే చెప్పులతో యోగి చెంపలు పగలగొట్టాలనిపించింది. యోగి అంటే అన్ని వదిలి కొండల మధ్య జపం చేసుకోవాలి. కానీ ఈయన మాత్రం సీఎం కుర్చీ మీద కుర్చున్నారు. అతను యోగి కాదని, భోగి’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు