'మళ్లీ ఆ పదాల జోలికి వెళ్లకండి.. పవర్‌ రాదు'

23 Jan, 2018 19:39 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ, ఎలాగైనా కోల్పోయిన అధికారాన్ని పొందాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ప్రచారాల్లో కూడా ఎలాంటి లోపం జరగకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. రెండు పార్టీల్లో కూడా అగ్ర నాయకుల సూచనల ఆధారంగానే పార్టీ క్షేత్ర స్థాయి శ్రేణులు ముందుకెళ్లాలని హెచ్చరిస్తున్నాయి. ఏ ఒక్క వ్యక్తితోనో, వర్గంతో పెట్టుకోకుండా అందరినీ ఆకర్షించే ప్రయత్నాల్లో తలమునకలవుతున్నాయి.

ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమైన కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక నేతలకు ముందుగానే ఏం చేయాలో ఏం చేయకూడదో అనే అంశాలను ప్రత్యేకంగా హెచ్చరించి మరీ చెప్పారు. ముఖ్యంగా బీఫ్‌, హిందూ టెర్రర్‌ అనే పదాల జోలికి అస్సలు వెళ్లకూడదని, వీటిని ఉపయోగించకుండానే పెద్ద నేతల నుంచి చిన్నస్థాయి నేతల వరకు ప్రచారంలో ముందుకు వెళ్లాలని హెచ్చరించారు. ఈ రెండు అంశాలే అధికారాన్ని దూరం చేసే ప్రమాదం లేకపోలేదని కూడా ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రధాన అంశాల నుంచి దృష్టిని మరల్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని, ట్రాప్‌లో పడేయాలను చూస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో అలా అవకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. ఎవరూ ఏమనుకున్నా బీఫ్‌, హిందూ టెర్రరిజం అనే పదాలపై ఎలాంటి ప్రకటనలు ఆవేశాలకు పోవద్దని సూచించారు.

మరిన్ని వార్తలు