టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయి

22 Feb, 2018 04:14 IST|Sakshi
శంకర్‌పల్లిలో జరిగిన రైతుపోరు సభలో మాట్లాడుతున్న లక్ష్మణ్‌

రైతుపోరు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

శంకర్‌పల్లి: రైతాంగ సమస్యలను విస్మరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం అన్నదాతలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర కల్పించకుండా మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.

బుధవారం రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల కేంద్రంలో జరిగిన కిసాన్‌ మోర్చా రైతుపోరుసభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామని, ఉచితంగా బోర్లు వేయిస్తామని, పెట్టుబడి వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామని, ప్రకృతి వైపరీత్యాలు జరిగితే రైతులను ఆదుకునేందుకు నిధి ఏర్పాటు చేస్తామన్నారు.  

నాలుగేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలేవీ...: రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చిన పాపాన పోలేదని, ఒక్క టీచర్‌ పోస్టూ భర్తీ కాలేదని లక్ష్మణ్‌ అన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పేరుతో పబ్బం గడుపుతున్న ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి యువత సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి ఎంబీసీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారని, ఏ కులానికి ఎన్ని నిధులు ఖర్చుపెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని, దీనిపై బీసీలను ఐక్యం చేసి ఉద్యమం చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్దం బాల్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, నాయకులు సుగుణాకర్‌రావు, శేఖర్‌జీ, ఆచారి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు