మజ్లిస్‌ మెప్పు కోసమే...

1 Mar, 2018 04:42 IST|Sakshi
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

ప్రధానిపై కేసీఆర్‌ చౌకబారు వ్యాఖ్యలు: లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: మజ్లిస్‌ మెప్పు పొందేందుకే ప్రధాని మోదీపై కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఎన్నికలు దగ్గర పడడం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మెప్పు పొందేందుకు నానా పాట్లు పడుతున్న కేసీఆర్, బీజేపీపై, ప్రధానిపై విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతాంగ సంక్షేమంకోసం ప్రధాని చేపడుతున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ రైతాంగం కోసం కేంద్రం నుంచి కోట్ల రూపాయల నిధులు వస్తున్నా, వాటిని ఖర్చుచేయలేక, ఆ విషయం జనం గమనించి ఎక్కడ ఈసడించుకుంటారోనన్న ఆందోళనతోనే కేసీఆర్‌ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి నాలుగేళ్లు నిద్రమత్తులో జోగిన సీఎం, ఎన్నికల ఏడాది కావటంతో రైతు సమన్వయ కమిటీల పేరుతో జిమ్మిక్కులు మొదలుపెట్టారని విమర్శించారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మిల్లు తెరిపించలేక చేతులెత్తేసి, కమీషన్ల వేటలో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ అంటూ కాంట్రాక్టర్లతో మిలాఖత్‌ అయ్యారని ఆరోపించారు.   ప్రధానిని కించపరిచేలా మాట్లాడిన సీఎం కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలు దహనం చేశాయి. కొన్నిచోట్ల రాస్తారోకోలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు.

మరిన్ని వార్తలు