సలాంగిరి..

16 Apr, 2019 13:16 IST|Sakshi
ఘర్షణ జరుగుతుంటే పక్కకు వెళ్లిపోతున్న డీఎస్పీ , ధర్నా చేస్తున్న లోకేష్‌

ఎన్నికల్లో పోలీసుల నిర్లక్ష్య వైఖరి

తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం

పలువురిపై కేసు నమోదు చేసేందుకు మంగళగిరి డీఎస్పీ సన్నాహాలు

తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి):  ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి నారా లోకేష్‌ మంగళగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆయనపై పోలీసులు వల్ల మాలిన అభిమానాన్ని చూపించారు.  నియోజకవర్గం వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వారు ఏం చేసినా చూసీచూడనట్లు వ్యవహరించారు. చివరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దృష్టి సారించి, వారు ఏమీ చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టారు. డీఎస్పీ నేతృత్వంలో ఈ నిర్వాహకం సాగిపోయింది. వివరా ల్లోకి వెళితే...

ఈనెల 11వ తేదీ మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్‌ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, స్థానికంగా ఉన్న డీఎస్పీ రామకృష్ణ చూసీచూడనట్లు వ్యవహరించడంతో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు కూడా అదే తీరులో బూత్‌ల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి   లోకేష్‌ రద్దీగా ఉన్న బూత్‌ల్లో తిరుగుతూ ఓటర్లకు అభివాదం చేస్తూ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. అలా చేయడాన్ని వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో పాటు సామాన్య ఓటర్లు  తీవ్రంగా వ్యతిరేకించారు. మొదట తాడేపల్లిలోని డోలాస్‌ నగర్‌లో తన ప్రచారాన్ని ప్రారంభించిన నారా లోకేష్‌ జాతీయ రహదారి వెంట ఉన్న పోలింగ్‌ బూత్‌ల్లో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. కొన్నిచోట్ల ఆయనకు నిరసనలు ఎదురయ్యాయి. చివరకు తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేట పోలింగ్‌బూత్‌ వద్దకు వచ్చి ఓటర్లకు మజ్జిగ పాకెట్‌లు, వాటర్‌పాకెట్లు, అరటిపండ్లు స్వయంగా దగ్గరుండి ఆయన కార్యకర్తలతో, నాయకులతో పం పిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిపై అక్క డ ఉన్న వివిధ పార్టీల బూత్‌ ఏజంట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు.

దాంతో అక్కడున్న వివిధ పార్టీల వారు లోకేష్‌ గో బ్యాక్‌ అంటూ నినా దాలు చేశారు. అప్పుడు కూడా ఆయన స్పం దించలేదు. 6.15 గంటలకు బూత్‌ దగ్గరకు వచ్చిన లోకేష్‌ 7.15 గంటలకు  వరకూ అక్కడి నుంచి కదలకపోవడం, విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, అదికూడా బూత్‌ దగ్గరలోనే   ఏర్పాటు చేయడం, మిగతా పార్టీల బూత్‌ ఏజెంట్ల వద్ద నుంచి, ఓటర్ల వద్ద నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. విలేకరులు సైతం ప్రశ్నిం చడంతో నాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ లోకేష్‌ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఒకదశలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ సీపీ కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొం ది. అప్పుడు కూడా డీఎస్పీ ముఖ్యమంత్రి కొడుకును వెనకేసుకు రావడం, ప్రతిపక్షం వారిని పం పించేందుకు ప్రయత్నం చేయకపోవడంతో, పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అర్బన్‌ ఎస్‌.పి. విజయరావు సంఘటనా స్థలానికి వచ్చి మొదట ధర్నాకు కూర్చున్న నారా లోకేష్‌ను అక్కడి నుంచి వెళ్లాలని సున్నితంగా సూచించి, ఆయనను బయటకు తీసుకువెళ్లారు. వెంటనే స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ రామాంజనేయులు స్ట్రైకింగ్‌ ఫోర్స్‌తో లాఠీచార్జ్‌ చేయించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తత దాల్చింది. దాంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి, టీడీపీకి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్పటి నుంచి 9 గంటల వరకు ఇదేవిధంగా ధర్నా కార్యక్రమం జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దాంతో ఎస్‌.పి ఇరువర్గాలను శాంతింపచేసి అక్కడి నుంచి పంపించి వేశారు.

డీఎస్పీ కవ్వింపు చర్యలు  
ఎన్నికల గొడవలు సద్దుమణిగాయి అన్న సమయంలో డీఎస్పీ రామకృష్ణ ప్రతిపక్ష నాయకులను కవ్వింపు చర్యలు చేస్తూ కేసులు నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. గొడవకు మూలకారణమైన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులపైన అభ్యర్థి నారా లోకేష్‌పైనా ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ప్రతిపక్షపార్టీ అయిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై, నాయకులపై కేసులు నమోదు చేసే ప్రక్రియను ప్రారంభిం చారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుస్టేషన్‌ను ముట్టడించి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అప్పుడుకూడా స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులు తమదైన శైలిలో మాటల తూటాలు పేల్చడంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడుకూడా డీఎస్పీ వారి వ్యాఖ్యలను ఖండించకుండా అందర్నీ వీడియో చిత్రీకరించారు. ఒకపక్క కేసులు లేవంటూ, మరో పక్క వీడియోలు, ఫొటోలు సేకరించి, వాటిలో ఉన్న వ్యక్తులపై కేసు నమోదు చేసే ప్రక్రియను చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

విధి నిర్వహణలో అలసత్వం 
పోలింగ్‌ బూత్‌ల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం వహించడం, అక్కడకొచ్చిన డీఎస్పీ రామకృష్ణ సైతం చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే నియోజకవర్గంలో పలుచోట్ల అల్లర్లకు కారణ మని తెలుగుదేశం నాయకులు, వైఎస్సార్‌సీపీనాయకులు వివిధ పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎప్పుడూ జరగని విధంగా ఈ నియోజకవర్గంలో గొడవలు అవ్వడానికి కారణం పోలీసుల వైఫల్యమేనని, పోలీసులు విధులు సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకునేవి కావని, సున్ని తంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించవలసిన వారు అధికారపార్టీకి కొమ్ముకాయడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని పలువురు    వ్యాఖ్యానిస్తున్నారు.

ఆయనుంటే వివాదమే!
మంగళగిరి డీఎస్పీ రామకృష్ణ ప్రతి ఒక్క సున్నితమైన కేసులోను ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని, పలువురు పోలీసులే వ్యాఖ్యానిస్తున్నారు. ముగిసిపోయిన రితికేశ్వరి కేసు విషయంలో కూడా కాంగ్రెస్‌ వారితో వివాదం తెచ్చుకొని, పలు ధర్నాలకు, నిరసనలకు కారణమయ్యారు. అనంతరం బదిలీ అయిన ఆయన తిరిగి  మళ్లీ మంగళగిరి వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైంది. సీతానగరంలో నివసించే జ్యోతి ప్రియుడి చేతిలో అతి దారుణంగా హత్యకు గురైంది. ఇక్కడ కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్ల జ్యోతి మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహిం చారు. బంధువులు రీపోస్టుమార్టం వివరాలు వెల్లడించాలని డాక్టర్‌ను ప్రశ్నించగా, డాక్టర్లు సమాధానం చెప్పకముందే డీఎస్పీ రామకృష్ణ చెప్పడానికి కుదరదని చెప్పడంతో పోలీసులకు, జ్యోతి బంధువులకు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తిరిగి మళ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకో, లేక వారి దాహాన్ని తీర్చేందుకో నారా లోకేష్‌ మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందచేస్తుంటే అక్కడి నుంచి పంపించకుండా, ఆయన అనుచరులతో ముచ్చటిస్తూ ప్రతిపక్షాల కంటపడడంతో పోలీసులు టీడీపీ వారు కుమ్మక్కయ్యారని ప్రతిపక్షాలు గొడవ చేయడంతో ఉద్రిక్తంగా మారింది.

4 గంటలపాటు ఉద్రిక్తంగా ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకో లేకపోయారు. తిరిగి మళ్లీ ప్రతిపక్షాలపై కేసులు నమోదు చేస్తూ తాడేపల్లిలో డీఎస్పీ  వివాదాలకు తెరతీస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఇరువర్గాల వారిపై కేసులు నమోదుచేస్తే గొడవ సద్దుమణుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు