‘అమ్మ’ తోడు.. అంతులేని వంతెన

21 Mar, 2019 07:10 IST|Sakshi
విజయవాడలో నాలుగేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న దుర్గగుడి ఫైఓవర్‌

సాక్షి, విజయవాడ : అమరావతిని రాజధానిగా ప్రకటించాక విజయవాడలో అద్దెలతోపాటు ట్రాఫిక్‌ కష్టాలూ రెట్టింపయ్యాయి. నగరంలోకి పెద్ద ఎత్తున రాకపోకలు సాగించే వాహనాలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఇక్కడ చేపట్టిన తొలి ప్రాజెక్టు దుర్గ గుడి ఫ్లైఓవర్‌ నిర్మాణం ఇంతవరకు పూర్తి కాలేదు. 11.6 కి.మీ దూరం ఉండే దేశంలోనే అతి పెద్ద ఫ్లైఓవర్‌ పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్‌వేని హైదరాబాద్‌లో 2005 చివరిలో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేశారు.

దుర్గగుడి ఫ్లైఓవర్‌ దూరం కేవలం 2.6 కిలోమీటర్లే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నా చంద్రబాబు సర్కారు ఓ వంతెన కూడా కట్టలేకపోవడంపై నగరవాసుల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలంటూ ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు భారీ ధర్నా కూడా చేయడం గమనార్హం. ఫ్లై ఓవర్‌ నిర్మాణం కోసం మూడేళ్లుగా రాకపోకలపై ఆంక్షలు విధించడంతో చెన్నై నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వెళ్లేవారికి, మచిలీపట్నం పోర్టు నుంచి పుణె వెళ్లే భారీ వాహనాల డ్రైవర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. 


 విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌  

నాని.. నాని
ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ ‘నాని’లు రంగంలోకి దిగారు. ప్రధాన రాజకీయ పక్షాలైన వైఎస్సార్‌సీపీ, టీడీపీ తరఫున బరిలో నిలిచారు. మొత్తం ఐదుగురు ‘నాని’లు ఉండగా... వీరిలో ఒకరు లోక్‌సభకు, నలుగురు శాసనసభకు పోటీ చేస్తున్నారు.

కొడాలి నాని (గుడివాడ), ఆళ్ల నాని (ఏలూరు), పేర్ని నాని (మచిలీపట్నం) వైఎస్సార్‌సీపీ నుంచి ప్రజాభిప్రాయం కోరుతుండగా... ఈలి నాని తాడేపల్లిగూడెం నుంచి శాసన సభకు, కేశినేని నాని విజయవాడ నుంచి లోక్‌సభకు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వీరంతా గత ఎన్నికలనూ ఎదుర్కొన్నారు. మరో విశేషమేమంటే... వీరంతా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల వారే కావడం. ఏదేమైనా తెలుగింటి చిన్నారులకు ముద్దు పేరైన ‘నాని’... రాజకీయాల్లోనూ వినిపిస్తుండటం విశేషం.

రూ.11 కోట్లు మట్టి పాలు.. 
దుర్గ గుడి వంతెన డిజైన్లపైనా నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు వరుసల ఫ్లై ఓవర్‌ ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అలైన్‌మెంట్‌ మార్చాలని ఒత్తిళ్లు చేయడం కూడా నిర్మాణంలో అంతులేని జాప్యానికి కారణమని సమాచారం. ఇక పనులు పూర్తి కాకుండానే సుందరీకరణ పేరుతో రూ.11 కోట్లు ఖర్చు చేయడంతో ఇదంతా బూడిదలో పోసిన పన్నీరేనని పేర్కొంటున్నారు.

మరోవైపు నగరంలోకి ప్రవేశించే భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా బెంజి సర్కిల్‌ వద్ద ఇటీవలే ప్రారంభమైన వంతెన నిర్మాణంలో కూడా చాలా జాప్యం జరుగుతోంది. ఫలితంగా ట్రాఫిక్‌ కూడలి వద్ద వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. సైబరాబాద్‌ను తానే నిర్మించానని తరచూ చెప్పుకునే సీఎం చంద్రబాబు... విజయవాడలో ఓ వంతెన కూడా కట్టలేకపోయారని నెటిజన్లు సోషల్‌ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు