మా ఆవిడే నా బలం

12 May, 2019 07:49 IST|Sakshi
కుటుంబ సభ్యులతో చిన్నయ్య

ఆయనది సాధారణ వ్యవసాయ కుటుంబం. చదువుకునేందుకు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లారు. వ్యవసాయం చేస్తూనే.. చదువుకున్నారు. విద్యార్థిదశలో విప్లవోద్యమాల వైపు నడిచినా.. ప్రస్తుతం దైవాన్ని తలుచుకోనిది ఏ పని కూడా మొదలుపెట్టరు. ఒకరికి సాయం చేయడంలోనే జీవితానికి తృప్తి ఉందని భావించే ఆయన.. తన భార్యే తన బలమని చెబుతారు. ఆయనే బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ‘సాక్షి పర్సనల్‌ టైం ఇంటర్వ్యూ’లో చిన్నయ్య చెప్పిన ముచ్చట్లు ఆయన మాటల్లోనే..

సాక్షి, మంచిర్యాల: ఆమే నా బలం నా ఎదుగుదలకు నా భార్య.. నా కుటుంబమే ప్రధాన కారణం. మాకు ఇద్దరు అమ్మాయిలు విహారిక, నిహారిక. మగ సంతానం లేదని ఎన్నడూ చింతించలేదు. ఆ ఇద్దరు బిడ్డలే మా సర్వస్వం. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంటి వ్యవహారాలన్నీ నా భార్య జయతారే చూసుకుంటోంది. ఇప్పటికి ఆమెనే ఇంటి బరువు బాధ్యతలు మోస్తుంది. నేను ఎన్నడూ ఇంటి వ్యవహారాలను పట్టించుకున్నది లేదు. పిల్లల చదువులు, ఇంటి అవసరాలన్నీ ఆమెనే చూస్తుంది. ఆమె మా వైవాహిక జీవితంలో ఎన్నడూ నాకు ఇది కావాలి.. అది కావాలి అడిగిన దాఖలాలు లేవు. రాజకీయాల్లో నేను బిజీగా ఉండడంతో.. ఏ సమస్య వచ్చినా నా ప్రమేయం లేకుండా పరిష్కరిస్తుంది. అందుకే జయతారనే నా బలంగా భావిస్తాను. నా రాజకీయ ఎదుగుదలకు నా భార్య తోడ్పాటు ఎంతగానో ఉంది.

ఆరు కిలోమీటర్లు నడిచేవాళ్లం..
నెన్నెల మండలం జెండా వెంకటాపూర్‌ మా స్వగ్రామం. అమ్మానాన్న దుర్గం మల్లు, రాజం. అన్న బాలస్వామి, అక్కలు రాజుబాయి, చిన్నక్క. మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మా ఊరిలో ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకునే వీలుండే. అందుకనే ఊళ్లో ఐదో తరగతి చదివి పొరుగునున్న ఆవుడం గ్రామానికి రోజు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి పదో తరగతి పూర్తి చేశాను. రోడ్డు సౌకర్యం సరిగా లేకపోయినా వాగులు, వంకలు దాటుకుంటా ఐదేండ్లు బడికి వెళ్లి ఫస్ట్‌ క్లాస్‌లో పాసైన. ఆ తర్వాత  మంచిర్యాలలో ఓ రూమ్‌ కిరాయికి తీసుకుని అక్కడే ఉండి ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసిన. నా విద్యాభ్యాసమంతా పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే సాగింది.

విద్యార్థి దశలో విప్లవోద్యమం వైపు...
ఎనిమిదో తరగతి చదువుకునే రోజుల్లోనే విప్లవోద్యమాల వైపు ఆకర్షితుడినయ్యా. పీడీఎస్‌యూలో చేరి పదో తరగతి వరకు చురుగ్గా పనిచేసిన. అప్పట్లో జన్నారంలో నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతులకు హాజరైన. న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత వేముపల్లి వెంకట్రామయ్యతో అప్పుడే పరిచయం ఏర్పడింది. ఆ శిక్షణ తరగతుల్లో దేవుడిపై చర్చ జరిగింది. ఆ రోజుల్లో దేవుడున్నాడని నేను, లేడని తరగతులకు హాజరైన ప్రముఖులు వాదించుకున్నాం. ప్రతి మనిషినీ నడిపించడంలో ఏదో శక్తి ఉందని నేను భావిస్తాను. సికాసలో కొంతకాలం పనిచేశాను. అప్పుడున్న పరిస్థితుల్లో రెండు సంవత్సరాల పాటు అజ్ఞాతవాసం కూడా గడిపిన.

నాడు ఎన్టీఆర్‌.. నేడు మహేశ్‌బాబు
కుటుంబంతో కలిసి సినిమాలు చూడటం చాలా అరుదు. పన్నేండేళ్ల క్రితం అంతఃపురం సినిమాను మా కుటుంబంతో కలిసి చూసిన. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండటం, ప్రజాసేవకు అంకితం కావడంతో మరెన్నడూ కలిసి సినిమాలు చూసిన దాఖలాలు లేవు. అందరు అంటుంటే అంతఃపురం సినిమా తర్వాత మరో పుష్కరకాలానికి బాహుబలి సినిమాను ఫ్యామిలీతో కలిసి చూసిన. సినిమా నటుల్లో పూర్వం ఎన్టీ రామారావు, ప్రస్తుతం మహేష్‌బాబు అంటే ఇష్టం. హీరోయిన్లలో పూర్వం శ్రీదేవి నటన బాగా నచ్చేది. ప్రస్తుత హీరోయిన్లలో అభిమానించే స్థాయిలో ఎవరూ లేరు.  

దైవాన్ని తలుచుకున్నాకే పని మొదలు
నేను నూటికి నూరు శాతం దేవుడిని నమ్ముతా. ప్రతిరోజూ స్నానాది కార్యక్రమాల తరువాత పూజ చేస్తా. పూజ చేయనిదే ఇంట్లో నుంచి బయటకు వెళ్లను. ఇప్పటికీ ఏ పని సంకల్పించుకున్నా దైవాన్ని తలుచుకున్నాకే మొదలు పెడుతా. విద్యార్థి దశలోనే దేవుడున్నాడనే అంశంపై ఇతర విద్యార్థులు, పెద్దలతో వాదించుకునేవాడిని. మనల్ని దైవశక్తి నడిపిస్తుందని కచ్చితంగా నమ్ముతా. 

వ్యవ‘సాయం’పై మక్కువ
వ్యవసాయ కుటుంబం కావడంతో ఓ పక్క చదువుకుంటూనే మరోపక్క అమ్మానాన్నతో కలిసి పొలం పనులకు వెళ్లేవాన్ని. మా నాన్నకు ఐదెకరాల మామిడి తోట, రెండెకరాల పొలం ఉండే. రోజు ఉదయం నిద్ర లేవగానే పేడతీసేది. ఎడ్లను మేతకు తీసుకెళ్లి 8 గంటల వరకు ఇంటికి వచ్చేది. ముఖం కడుక్కొని, స్నానం చేసి పుస్తకాల సంచి  పట్టుకుని బడికి వెళ్లేది. తిరిగి ఇంటికచ్చినంగా భోజనం చేసి మళ్లీ పొలం పనులకు వెళ్లేటోన్ని. నాకు దుక్కులు దున్నడం, జంబు కొట్టడం, నాట్లువేసే పనులు వచ్చు.  నిజంగా ఆ రోజుల్లో జీవితం చాలా అందంగా ఉండేది. అరమరికలు లేకుండా అందరం కలిసి మెలిసి జీవించేటోళ్లం. చిన్నప్పుడు తీరొక్క ఆటలు ఆడేవాళ్లం. ఎండాకాలంలో మామిడి పిక్కల ఆట, గోళీలు, చిర్రగోనే, పైసలాట ఆడేవాళ్లం. మాకున్న వ్యవసాయ బావిలో దూకి ఈత కొట్టేవాళ్లం. మా ఊళ్లో ఇద్దరు బాల్య మిత్రులుండేవాళ్లు. వారిలో భూమయ్య అనే మిత్రుడు కాలం చేశాడు. ఇంకో మిత్రుడు ఏస్కూరి పోశం ఉన్నాడు.  భూమయ్య, పోశంతో ఎప్పుడూ అన్యోన్యంగా ఉండేవాడిని. వాళ్లు నాకు పంచ ప్రాణాలుగా ఉండేవారు. ఇప్పటికి పోశంను కలుస్తూ ఉంటా. 

సాయం చేయడంలోనే తృప్తి
పక్కవారికి సాయం చేయడంలో ఎంతో తృప్తి ఉంది. నా జీవితంలో అలాంటి రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. నెన్నెల మండలం గుండ్లసోమారం గ్రామానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థి నాలుగేళ్ల క్రితం నావద్దకు వచ్చాడు. ఆ విద్యార్థికి మహారాష్ట్రలో ట్రిపుల్‌ ఐటీలో సీటు వచ్చింది. సీటు దక్కాలంటే రూ.18,500 ఫీజు కట్టాలని, ఫీజు చెల్లించడానికి అదేరోజు ఆఖరు అని, ఆర్థిక సాయం చేస్తారా..? అంటూ ప్రాధేయపడ్డాడు. అప్పటికప్పుడే నా వద్ద, నా వద్దకు వచ్చిన వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు జమచేసి ఆ మొత్తం అందజేశాం. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ విద్యార్థి వచ్చి నేను చేసిన సాయంతో ట్రిపుల్‌ ఐటీ సీటు రావడంతోపాటు, జాతీయ స్థాయిలో స్కాలర్‌షిప్‌కు కూడా  ఎంపికయ్యానని చెప్పడం జీవితంలో మరిచిపోలేని తొలి ఘటన.

అలాగే మంచిర్యాలకు చెందిన ఓ బీటెక్‌ విద్యార్థి రెండు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో నా వద్దకు వచ్చాడు. ఓ కిడ్నీ దానం చేయడానికి ఆయన తండ్రి ముందుకు వచ్చాడని, కానీ ఆ కిడ్నీని అమర్చడానికి రూ.12.40 లక్షలు వ్యయం అవుతుందని, ఎలాగోలా కాపాడాలని ప్రాధేయపడ్డాడు. నేను సీఎం కేసీఆర్‌ వద్దకు వెళ్లి పరిస్థితి వివరించి విద్యార్థికి రూ.12 లక్షలు సీఎం రిలీఫ్‌ఫండ్‌ కింద మంజూరు చేయించి ప్రాణాలు నిలిపాను. ఆ విద్యార్థి ఆపరేషన్‌ సక్సెస్‌ అయి మా ఇంటికి వచ్చి చెమర్చిన కళ్లతో చెప్పిన కృతజ్ఞతలు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన.

మరిన్ని వార్తలు