రాజన్న పాలనలో..నాలుగింతల సంక్షేమం

2 Apr, 2019 09:37 IST|Sakshi

సంక్షేమ ఫలాలను ముస్లిం దరిచేర్చిన మహనీయుడు వైఎస్సార్‌ 

 మహానేత చొరవతోనే బీసీ–ఈ వర్తింపు 

 నాలుగు శాతం రిజర్వేషన్ల అమలుతో జీవితాల్లో వెలుగులు  

భవిష్యత్తుపై భరోసా కల్పించిన రిజర్వేషన్‌ 
ముస్లింలలో ఉన్న ఆర్థిక వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రిజర్వేషన్లను అమలులోకి తీసుకొచ్చారు. 15 ఉపకులాలను బీసీలుగా గుర్తించి వారికి విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో ఐదు శాతం రిజర్వేషన్లకు అవకాశం కల్పించారు. దీనికి ప్రత్యేకంగా జీఓను తెచ్చి ఆచరణలో పెట్టారు. కొన్ని అడ్డంకులు ఎదురైన ఇచ్చిన మాటకు కట్టుబడి న్యాయస్థానంలో స్టే తీసుకొచ్చి అమలు చేశారు. ఆటంకాలు తొలగించేందుకు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2007లో జీఓ ఎంఎస్‌ 23 జారీ చేశారు. దీంతో వేలాది ముస్లింలు ఉద్యోగ, వయో పరిమితి ఉపాధి రంగాల్లో అర్హత సాధించి జీవితాల్లో స్థిరపడ్డారు.  

మంత్రి వర్గంలో స్థానమివ్వని బాబు 
2014 ఎన్నికల సమయంలో ముస్లిం సంక్షేమానికి చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చలేకపోయారు. మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిం వ్యతిరేక భావజాలంతో ఈ ఐదేళ్లు పాలన సాగించారు. ముస్లిం సంక్షేమానికి వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలకు తిలోదకాలిచ్చేశారు. ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలులో చిత్తశుద్ధి లోపించడంతో వేలాదిగా ముస్లిం విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. తన మంత్రి వర్గంలో ఏ ఒక్క ముస్లింలకు స్థానం కల్పించకుండా తనలోని ముస్లిం వ్యతిరేక భావజాలాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లైంది. చివరకు వైఎస్సారసీపీ తరుఫున గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి, పార్టీలోకి చేర్పించుకున్నారు.  ఈ ఐదేళ్లు ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖను ముస్లిమేతరులకు కేటాయించి తీరని అన్యాయం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నాలుగు నెలల ముందు ఎన్‌ఎండీ ఫరూక్‌కు నామమాత్రంగా మంత్రి పదవిని ఇచ్చి చేతులు దులుపుకున్నారు.  

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్య సాకారం 

పేదరికం కారణంగా ముస్లింల ఇళ్లలో నిరక్షరాస్యత వికట్టాటహాసం చేస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలతో పదో తరగతి పూర్తి చేయడమే గగనం. దీంతో సమాజంలో చిన్నాచితక పనుల్లో చిన్నప్పటి నుంచే ముస్లిం పిల్లలు నలిగిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి ముస్లింలను తప్పించేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని ముస్లింలకు 2007లో వైఎస్సార్‌ వర్తింపజేశారు. అర్హులైన నిరుపేద ముస్లిం విద్యార్థులకు ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, బీఈడీ, పీజీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా, లా, నర్సింగ్, ఐఐటీ వంటి వృత్తి విద్యా కోర్సులను ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకునే బృహత్తర అవకాశాన్ని వైఎస్సార్‌ కల్పించారు. ఆయన చలువ వల్ల నేడు ఎందరో ముస్లింలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా, డాక్టర్లుగా జీవితంలో స్థిరపడ్డారు.  

ముస్లింలకు ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు 
ముస్లింల పట్ల చిత్తశుద్దితో ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. ముస్లింల అభ్యున్నతిపై ఆయనకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2014 ఎన్నికల్లోనూ నాలుగు అసెంబ్లీ స్థానాలను ముస్లింలకు జగన్‌ కేటాయించిన వైనం విదితమే. 2019 ఎన్నికల్లో ఈ సంఖ్య ఐదుకు ఎగబాకింది.   

ముస్లింల అభ్యున్నతికి  జగన్‌ భరోసా 
తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తరహాలోనే ముస్లింల అభ్యున్నతికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా భరోసానిస్తున్నారు. ప్రధానంగా అధికారంలోకి రాగానే ముస్లింలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా 45 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. మసీదుల్లో పనిచేస్తున్న ఇమాంలకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనాన్ని అందిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులకు ఆస్కారం కల్పిస్తామన్నారు. అన్ని కాంట్రాక్ట్‌ పనుల్లో మైనార్టీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలతో సమానంగా 50 శాతం పనులు కేటాయిస్తామన్నారు. దుల్హన్‌ పథకం ద్వారా రూ. లక్షను అందిస్తామన్నారు. ఈ పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ ఫలాలను అందించేందుకు సిద్ధంగా ఉన్న జగన్‌ విశ్వసనీయతను ముస్లింలు నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో జగన్‌కే తమ మద్దతు అంటూ బాహటంగానే ప్రకటిస్తున్నారు.  

డిగ్రీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేది 


లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నా మెడిసిన్‌ సీటు రాలేదు. బీడీఎస్‌లో అవకాశం దక్కింది. వైఎస్సార్‌ కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్‌ ఉంది మరోసారి ప్రయత్నించు అని అమ్మ నుస్రత్, నాన్న అతావుల్లా నన్ను ప్రోత్సహించారు. దీంతో రెండో సారి ప్రయత్నించడంతో మెడిసిన్‌లో సీటు దక్కింది. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సార్‌ రిజర్వేషన్‌ కల్పించకపోయింటే ఏ డిగ్రీనో, ఇతర కోర్సులు చేసేదాన్నేమో. వైఎస్సార్‌ చలువతోనే ఈ స్థాయికి చేరుకున్నా. మొదటి ఏడాది అనాటమీలో గోల్డ్‌మెడల్‌ సాధించా. 
– అయిషా తస్నీమ్, గోల్డ్‌ మెడలిస్టు, మెడికో 2016 బ్యాచ్, అనంతపురం  

కొత్త రుణాలతో ఆర్థిక చేయూత 

జీవనోపాధుల కోసం ముస్లింలు తీసుకున్న రుణాలను ఆర్థిక పరిస్థితులు సహకరించక చెల్లించలేకపోతున్న ఎందరికో వైఎస్సార్‌ అండగా నిలిచారు. ఇందు కోసం ప్రత్యేకంగా 2005లో రుణమాఫీ పథకాన్ని వైఎస్సార్‌ అమలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో సమానంగా రూ. లక్షలోపు ఉన్న వివిధ రకాల ముస్లింల రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు తిరిగి వారికి కొత్తగా రుణాలను అందజేసి ఆదుకున్నారు. దీని ద్వారా జిల్లాలో 12 వేల మంది ముస్లింలకు లబ్ధి చేకూరింది. దీంతోపాటు లబ్దిదారులకు  మార్జిన్‌ మనీ విధానాన్ని రద్దు చేసి 50 శాతం సబ్సిడీతో రుణాలను అందించే పథకాన్ని వైఎస్సార్‌ ప్రవేశపెట్టి నిరుపేద ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపారు. చంద్రబాబు పాలనలో రుణాలు అందక ముస్లింలు నలిగిపోయారు. కమిటీల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి చంద్రబాబు తెరలేపారు. జిల్లా వ్యాప్తంగా 2018–19 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రౌండింగ్‌ చేసిన రుణాలు కేవలం 145 మాత్రమే. దీని ద్వారా ఈ ప్రభుత్వానికి ముస్లింల పట్ట ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.  

ముస్లిం పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు

నిరుపేద ముస్లిం పిల్లల ఉన్నత చదువులకు చంద్రబాబు పాలనలో భరోసా లేకుండా పోయింది.  ఇంత దుర్మార్గమైన పాలన గతంలో ఎన్నడూ చూడలేదు. మా పిల్లల చదువులు, వారి భవిష్యత్తు బాగుండాలనుకుంటే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు మళ్లీ అమలులోకి రావాలి, ఇందుకు జగన్‌ను సీఎంగా చేసుకోవాలి. – బాబావలి, డ్రైవర్, బత్తలపల్లి

పెద్దాయన చలువతోనే ఇంజినీర్‌నయ్యా 

మాది పరిగి మండలం కొడిగెహళ్లి. మా నాన్న అల్లాబకాష్‌ కార్పెంటర్‌గా పనిచేస్తు అరకొర సంపాదనతోనే కుటుంబాన్ని పోషించుకుని వచ్చేవారు. నిజం చెప్పాలంటే పదో తరగతి తర్వాత మా చదువులు ఆగిపోతాయని భయపడ్డాను. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, నాలుగు శాతం రిజర్వేషన్‌ కారణంగా నేను సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని కాగలిగాను. ఈ రోజు మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉందంటే అదంతా వైఎస్సార్‌ చలువే. ఆనాడు వైఎస్సార్‌ సార్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం అమలు చేయకపోయి ఉంటే ఈ రోజు నేనను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు.  
– కొడిగెనహళ్లి షబ్బీర్, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, బెంగళూరు 

మా ఊళ్లో రెండో డాక్టర్‌ నేనే 

నాన్న షేక్‌మహబూబ్‌ బాషా రైతు. అమ్మ మహబూబ్‌బీ. రైతు కుటుంబంలో కష్టాలు ఎన్ని ఉంటాయో అందరికీ తెలుసు. మెడిసిన్‌ చదువుతానని అనుకోలేదు. వైఎస్సార్‌ అధికారంలోకి రాగానే రిజర్వేషన్‌ కల్పించారు. ఆయన గొప్పమనసే మాలాంటి ఎంతో మందిని ఉన్నత స్థాయికి చేర్చింది. మా ఊళ్లో రెండో డాక్టర్‌ను నేనే. మా సమీప బంధువు సోదరుడు సద్దాం హుస్సేన్‌ కూడా రిజర్వేషన్‌ ద్వారానే సీటు సాధించాడు. వైఎస్సార్‌ చేసిన మేలును మేమేన్నటికీ మరచిపోం.  – డాక్టర్‌ షేక్‌ రియాజ్‌ హుస్సేన్, 
హౌస్‌సర్జన్, అయ్యలూరు, నంద్యాల  

ఉచిత సామూహిక వివాహాలతో కొండంత ఊరట 

మిగిలిన అన్ని సామాజిక వర్గాల కంటే ముస్లింలలో పేదరికం అత్యధికంగా ఉంది. ఈ ఒక్క కారణమే వారిని చదువులకు దూరం చేస్తూ వచ్చింది. పేదరికం కారణంగా ముస్లిం అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయలేని స్థితిలో తల్లిదండ్రులు నలిగిపోసాగారు. ఇలాంటి తరుణంలోనే కుమార్తెకు పెళ్లి చేసివ్వడం ద్వారా ఆ నిరుపేద ముస్లిం తల్లిదండ్రులు ఆర్థికంగా చితికి పోరాదనే తలంపుతో ఉచిత సామూహిక వివాహాలకు వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. పెళ్లిళ్లతోపాటు నవ వధూవరులకు పెళ్లి దుస్తులు, రెండు గ్రాముల బంగారంతో కూడిన నల్లపూసల హారం(కాలిపోతాకా లచ్చా) పవిత్ర ఖురాన్‌ గ్రంథం, మంచం, వంట సామగ్రి, ఒక్కో జంటకు రూ. 15వేలు అందిస్తూ వచ్చారు. ఈ పథకం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున వివాహాలు నిర్వహించారు.   

మరిన్ని వార్తలు