ఈ కుర్రాళ్లకు కాలం కలిసొస్తే...

25 Oct, 2019 03:41 IST|Sakshi
దుష్యంత్‌ చౌతాలా,ఆదిత్య థాకరే

బాల్‌ థాకరే వారసుడిగా వచ్చిన ఆదిత్య... ఓం ప్రకాష్‌ చౌతాలా మనవడిగా బరిలోకి దిగిన దుష్యంత్‌... ఇద్దరూ కుర్రాళ్లే. తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగినవారే!!. అయితేనేం... శివసేన భారీ విజయాన్ని దక్కించుకుని... సీఎం కుర్చీని రెండున్నరేళ్లు తమకివ్వాలని బేరాలకు దిగింది. బీజేపీ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్‌– ఎన్‌సీపీలతో జట్టుకట్టి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. అలాగే హరియాణాలో 10 సీట్లు గెలిచి దుష్యంత్‌ చౌతాలా జేజేపీ కూడా కింగ్‌ మేకర్‌గా మారింది. దుష్యంత్‌ను సీఎంను చేసినవారికే మద్దతిస్తామని షరతు పెడుతోంది. కాలం గనక కలిసొచ్చి వీళ్లిద్దరూ ముఖ్యమంత్రులయితే... మొదటి బంతికి సిక్స్‌ కొట్టేసినట్లే.

దుష్యంత్‌... దేవీలాల్‌ వారసుడు!!
హరియాణాలోని హిస్సార్‌ జిల్లా, దరోలిలో 1988 ఏప్రిల్‌ 3న దుష్యంత్‌ జన్మించారు. తల్లి నైనా సింగ్‌ చౌతాలా, తండ్రి అజయ్‌ చౌతాలా. తండ్రి పార్లమెంటు మాజీ సభ్యుడు. రాజకీయ దిగ్గజం, తాత ఓం ప్రకాష్‌ చౌతాలా. నాలుగు సార్లు హరియాణా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఐఎన్‌ఎల్‌డీ అధ్యక్షుడు. ముత్తాత దేవీలాల్‌. మాజీ ఉప ప్రధాని కూడా!!. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన దుష్యంత్‌ 2014లో ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ నుంచి పోటీ చేసి హిసార్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు. అప్పటికి ఆయన వయసు 26 ఏళ్లు. తక్కువ వయసులోనే లోక్‌ సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు కూడా. లోక్‌కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. నల్సార్‌ నుంచి ఎల్‌ఎల్‌ఎమ్‌ చేశారు. మేఘనా చౌతాలాని ఏప్రిల్‌ 18, 2017న పెళ్లి చేసుకున్నారు.  

అన్నదమ్ముల పోరు...
అన్నదమ్ములు అజయ్‌ చౌతాలా, అభయ్‌ చౌతాలాల మధ్య తలెత్తిన విభేదాలు ఐఎన్‌ఎల్డీలో చీలికకు దారితీశాయి. టీచర్‌ రిక్రూట్‌ మెంట్‌లో అవినీతి ఆరోపణలతో ఓం ప్రకాష్‌ చౌతాలా 2013లో జైలుకెళ్ళాల్సి వచ్చింది. తరువాత ఎంపీగా గెలిచిన దుష్యంత్‌ చౌతాలా... అభయ్‌ చౌతాలా నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కుటుంబ రాజకీయాలు పార్టీని మరింత విచ్ఛిన్నం చేశాయి. 2018 డిసెంబర్లో ఐఎన్‌ఎల్‌డీ నుంచి దుష్యంత్‌ని బహిష్కరించారు. దీంతో 2018 డిసెంబర్‌ 9న జననాయక్‌ జనతాపార్టీని (జేజేపీ) దుష్యంత్‌ ఏర్పాటు చేశారు. తన ముత్తాత దేవీలాల్‌తో పాటు దుష్యంత్‌ చౌతాలా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటించారు.

చట్టసభలోకి ‘ఠాక్రే’
ముంబై: బాల్‌ ఠాక్రే కావచ్చు... ఉద్ధవ్‌ థాకరమే కావచ్చు. శివసేన అధిపతులుగా వీరు తమ ఇంట్లోంచే పార్టీని నడిపించారు. కార్యకర్తల్ని చట్టసభలకు పంపించారు కానీ... తామెన్నడూ ఎన్నికల బరిలో నిలవలేదు. కానీ వారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే (29) మాత్రం ఎన్నికల బరిలో నిలిచి... గెలిచారు. ఆ కుటుంబం నుంచి చట్టసభలో అడుగుపెడుతున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ముంబయిలోని వర్లీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆదిత్య ఠాక్రే బాంబే స్కాటిష్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించారు. సెయింట్‌ జేవియర్‌ నుంచి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. తరవాత కేసీ కళాశాలలో న్యాయ విద్య చదివారు. సాహిత్యంపై అభిరుచి కలిగిన ఆదిత్య ఠాక్రే తాను రాసిన కవితలతో 2007లో ‘మై థాట్స్‌ ఇన్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌’అనే పుస్తకాన్ని అమితాబ్‌ బచ్చన్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ‘ఉమ్మీద్‌’పేరిట ప్రైవేట్‌ పాటల ఆల్బమ్‌నూ వెలువరించారు.  

ఆదిత్య ఠాక్రే 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కింది స్థాయిలో కార్యకర్తలతో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. ముంబయిలో షాపింగ్‌ మాళ్లు, రెస్టారెంట్లను రాత్రంతా తెరిచి ఉంచేందుకు అనుమతించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జన ఆశీర్వాద్‌ యాత్ర పేరిట మహారాష్ట్ర మొత్తం చుట్టివచ్చారు.

మరిన్ని వార్తలు