వారిపై ఉక్కుపాదం మోపుతాం : సీపీ ద్వారకా తిరుమల రావు

9 Apr, 2019 19:22 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలని.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని సీపీ ద్వారక తిరమల రావు హెచ్చరించారు. నేటి సాయంత్రం ఆరుగంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి ఫేజ్‌లో  జరుగనున్న ఎన్నికలకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. 1588 పోలింగ్‌ స్టేషన్లలో 530 పోలింగ్‌ కేంద్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. 332 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామన్నారు. 198 మొబైల్‌ పార్టీలు, 5 స్టేకింగ్‌ ఫోర్స్‌,  5 నైట్‌ ఫోర్స్‌, పది చెక్‌పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2 కోట్ల 43 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. వాటిలో 70 లక్షలు ఆధారాలు చూపిన వారికి తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు. మూడు వేల లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి 391 కేసులు నమోదయ్యాయన్నారు.

మరికొందరి నుంచి లైసెన్స్‌డ్‌ వెపన్‌లు స్వాధీనం చేసుకున్నామని, ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1449 రౌడీషీటర్‌లను బైండోవర్‌ చేశామన్నారు. ఆరుకిలోల బంగారం, నాలుగు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1231 మంది ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ వాలంటీర్స్‌ ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఓటర్లు మై ఓట్‌ క్యూ యాప్‌ ద్వారా వెసులు బాటు చూసుకుని ఓటు వేయవచ్చన్నారు. ఏవైనా ఫిర్యాదులుంటే.. 7328909090కి వాట్సాప్‌ లేదా 100కి డయల్‌ చేయవలసిందిగా సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బాడీ కెమెరాలు, ఈ బందోబస్తు, యాప్‌ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పెనమలూరు, విజయవాడ సెంట్రల్‌, మైలవరం, గన్నవరం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు