బ్యాంకుల నుంచి నిరాశగా వెనుదిరిగిన డ్వాక్రా మహిళలు

8 Feb, 2019 09:47 IST|Sakshi

చంద్రన్న చేతిలో మోసపోయాం : డ్వాక్రా సభ్యులు

సాక్షి, ఏలురు/పశ్చిమగోదావరి :  డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ... ఎన్నికల ముందు మరో మోసానికి తెరలేపారు. పసుపు కుంకుమ కార్యక్రమం పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. రుణాలను మాఫీ చేయకపోగా తమకు చెల్లని చెక్కులు ఇచ్చారని డ్వాక్రా సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన చెక్కులను బ్యాంకు అధికారులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నారని వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. (‘డ్వాక్వా’పై దద్దరిల్లిన కౌన్సిల్‌)

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమల్లి మండలం కామయ్యపాలెంలోనూ టీడీపీ ప్రభుత్వ మోసం బయటపడింది. ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో చెక్కులు కొందరికి మాత్రమే వచ్చాయని డ్వాక్రా మహిళలు చెప్తున్నారు. ఆ చెక్కులు తీసుకుని బ్యాంక్‌కు వెళితే.. పాత బాకీలో జమ చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న చేతిలో మరోసారి మోసపోయామని నిరాశతో ఇళ్లకు వెనుదిరిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో డ్వాక్రా సభ్యులెవరూ ఆ రుణాలు చెల్లించలేదు. దాంతో అసలుతో పాటు వడ్డీ కూడా తడిసి మోపెడు అయింది.  రానున్న ఎన్నికల నేపథ్యంలో .... ఓట్లు రాబట్టకునేందుకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయాల్సి రావడంతో టీడీపీ సర్కార్‌ పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులిచ్చి చేతులు దులుపుకుంటుందని మహిళలుమండిపడుతున్నారు. 

మరిన్ని వార్తలు