ప్రతి ఆటోడ్రైవర్‌కు రూ.10 వేలు

14 May, 2018 20:06 IST|Sakshi

ఏలూరు సభలో వైఎస్‌ జగన్‌ సంచలన ప్రకటన

సాక్షి, ఏలూరు: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవర్లను ఆర్థికంగా ఆదుకుంటామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీయిచ్చారు. రవాణా శాఖ నిబంధనలను అనుసరించి పలు రకాల పత్రాలు చేయించుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆటోడ్రైవర్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించారు. 161వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఏలూరు పాతబస్‌స్టాండ్‌ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.... అన్ని జిల్లాల్లోని ఆటోడ్రైవర్ల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

‘‘వెళ్లిన ప్రతిచోటా ఆటోడ్రైవర్లు నన్ను కలుస్తున్నారు. రోజంతా కష్టపడితే మూడు నుంచి ఐదొందలు వస్తాయని, అందులో నుంచి రోజూ 50 రూపాయలు లేదా వంద రూపాయలను చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటున్నదని చెప్పారు. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఆటోకు ఫిట్‌నెస్‌, ఇన్సురెన్స్‌, రోడ్‌ టాక్స్‌ పత్రాలు లేనందున పోలీసులు డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు డ్రైవర్లు చెప్పారు. ఆ పత్రాలు చేయించుకోవాలంటే అదనంగా కనీసం 10వేల రూపాయలన్నా ఖర్చవుతుందని రోజూ ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో.. రాబోయే ప్రజాప్రభుత్వంలో ఆటోడ్రైవర్లను ఆదుకుంటామని హామీ ఇస్తున్నా. సొంత ఆటోను నడుపుకొనే డ్రైవర్లకు ఆటో ఫిట్‌నెస్‌, ఇన్సురెన్స్‌, రోడ్‌ టాక్స్‌ పత్రాలు చేయించుకోవడానికి అవసరమైన డబ్బును ప్రభుత్వమే ఇస్తుంది. తద్వారా ప్రమాద బీమా కూడా లభిస్తుంది. డ్రైవర్లు, ప్రయాణికులు అందరికీ ఊరట కలిగించే అంశమిది..’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు