‘కేసీఆర్‌ అసెంబ్లీ రద్దు చేసినా.. ఎన్నికలకు అవకాశం లేదు’

31 Aug, 2018 17:03 IST|Sakshi
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి

సాక్షి, న్యూ ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అసెంబ్లీని రద్దు చేసినా ఎన్నికల సంఘం ఎన్నికలు పెట్టే అవకాశం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఓ పీ రావత్‌ను కలిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలతో అనేక సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఏడు మండలాల సమస్యపై, విలీనంపై ఎన్నికల కమిషన్‌ వద్ద స్పష్టత లేదన్నారు.

ఆర్టికల్‌ 170 ద్వారానే నియోజకవర్గాల మార్పులు చేర్పులు చేయాలని, దానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని అన్నారు. ఏడు మండలాల బదిలీలతో తెలంగాణ నియోజకవర్గాల స్వరూపం మారిందని తెలిపారు. హోం శాఖ ఉత్తర్వులతో ఇది సాధ్యం కాదని, పార్లమెంట్‌ రాజ్యాంగ సవరణతోనే ఏడు మండలాల సమస్య పరిష్కారం సాధ్యమన్నారు. పాత ఓటర్ల జాబితాలో అనేక అక్రమాలు ఉన్నాయని ఆరోపించారు. అందుకే హడావిడిగా టీఆర్‌ఎస్‌ ముందస్తు ఎన్నికలకు వెళుతోందని వ్యాఖ్యానించారు.

వీవీ ప్యాట్‌ మిషిన్ల నిర్వహణకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వలేదని వెల్లడించారు. ఈ సమస్యల నేపథ్యంలో ఎన్నికలు డిసెంబర్లో జరిగే అవకాశం లేదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలకు మొన్నటిదాకా మద్దతు తెలిపిన కేసీఆర్‌, ఇప్పుడు ప్రత్యేకంగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి కారమనమేంటని ఆయన ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు