ప్రజాస్వామ్యం అపహాస్యం

14 Mar, 2019 08:39 IST|Sakshi
ఈఏఎస్‌ శర్మ, విశ్రాంత ఐఏఎస్‌

ఐదేళ్లు ఏమీ చేయకుండా ఇప్పుడు మభ్యపెట్టాలని చూస్తారా? 

ప్రజలను ‘ఓటు బ్యాంకు’గానే చూస్తున్నారు

సరిగ్గా ఎన్నికల సమయంలో పథకాల పేరుతో జమ చేయడం ఏంటి? 

చెమటోడ్చిన ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వరు 

ఎన్నికల తాయిలాలకు నిధులు

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్రాంత ఐఏఎస్‌ శర్మ

‘‘పాలకులు గడచిన ఐదేళ్లలో ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ.. మ«భ్యపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకోవడం అభ్యంతరకరమైన విషయం. ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల పాటు పనిచేసిన కూలీలకు రూపాయి కూడా ఇవ్వలేదు. చెమటోడ్చి పనిచేసిన వారికి నెలకు రూ.10 వేలపైనే రావాల్సి ఉండగా.. వాటిని ఇవ్వకుండా ఇతర పథకాలకు ఎన్నికల కోసం నగదును బదిలీ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే’’ అని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, ఇంధన శాఖ పూర్వ కార్యదర్శి  ఈఏఎస్‌ శర్మ వ్యాఖ్యానించారు. విశాఖలో ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... 

నిష్పాక్షిక ఎన్నికలే శ్రీరామరక్ష
జాతీయ ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) పార్లమెంట్, శాసన సభలకు నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించాలి. ఓటర్ల జాబితాలో అర్హులైన అందరు ఓటర్ల పేర్లను, ముఖ్యంగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువ ఓటర్ల పేర్లను చేర్చటం, ఎన్నికల్లో మతపరమైన ప్రచారాలు లేకుండా చూడటం, డబ్బుతో ఓట్లను కొనే రాజకీయాలను నియంత్రించడం వంటి బాధ్యతలు ఉన్నాయి. ఏపీలో సుమారు 12 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నా.. వారి రిజిస్ట్రేషన్‌ నత్తనడకన సాగుతోంది.  ఎన్నికలపై డబ్బు, మద్యం  ప్రభావం ఉండకుండా కఠినమైన ముందస్తు చర్యలు తీసుకోవాలి.

సమాచార చోరులపై కఠిన చర్యలు తీసుకోవాలి
‘ఆధార్‌ కార్డు వివరాలను, ఓటర్ల జాబితాలను కొన్ని రాజకీయ పార్టీలు అనధికారికంగా సేకరించి, ఫామ్‌–7 ముసుగులో దుర్వినియోగం చేస్తున్నారన్న వాదనలున్నాయి. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపణలున్నాయి. సమాచార చౌర్యం చేసిన వాళ్లు ఎంతటి పెద్ద మనుషులైనా దోషులుగా పరిగణించాలి. ఎన్నికల చట్టాల కింద, ఐటీ చట్టాల కింద, ఐపీసీ చట్టం కింద ఆయా వ్యక్తులు, పార్టీలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి’

ఏపీ ఐటీ సలహాదారుకు ‘ఆధార్‌’ చైర్మన్‌ పదవా!
‘ఏపీ ప్రభుత్వానికీ ఐటీ సలహాదారుగా పని చేస్తున్న వ్యక్తే ఆధార్‌ కార్డుల వ్యవస్థను పర్యవేక్షించే యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) అధ్యక్షునిగా ఉన్నారు. ఇలా ఒకే వ్యక్తి రెండు పదవులు ఎలా నిర్వర్తిస్తారు. ప్రజల వ్యక్తిగత సమాచారం (డేటా) చౌర్యంపై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశమే కదా. పైగా సదరు అధికారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లాభం పొందడం తీవ్ర అభ్యంతరకరం. ఇటీవల సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో సుమారు 15 మంది ఐఏఎస్‌లకు అప్పనంగా స్థలాలు కట్టబెట్టారు. ఎందుకిలా ఇచ్చారు, రైతుల వద్ద నుంచి భూములు లాక్కున్నది ఐఏఎస్‌లకు ఇచ్చేందుకా. ఎంత దారుణం. ఉచితంగా భూములు పొందిన వారిలో యూఐడీఏఐ చైర్మన్‌ కూడా ఉన్నారు. ప్రభుత్వం అలా స్థలాలు ఉచితంగా ఇవ్వడమంటే.. దానిని లంచగొండితనంగానే భావించాలి. దీనిపై ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రభుత్వ ఐటీ సెక్రటరీకి లేఖ రాశాను. ఏపీ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా సేవలందిస్తున్న వ్యక్తికి యూఐడీఏఐ చైర్మన్‌ పదవి ఇవ్వడమే తప్పు. ఆధార్‌పై ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి. ఆధార్‌ ద్వారా డేటా చోరీ అవుతోందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయనకు ఉచితంగా భూములు కట్టబెడితే  ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని ఆ లేఖలో పేర్కొన్నాను’ 

విదేశీ విరాళాలు ఆక్షేపణీయం
రాజకీయ పార్టీలు విదేశీ ప్రైవేటు కంపెనీల నుంచి విరాళాలు తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరం, ఆక్షేపణీయం. కంపెనీల నియంత్రణ చట్టాన్ని సవరించి మన దేశంలో రిజిస్టర్‌ అయిన కంపెనీల నుంచి రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడానికి అవకాశం కల్పించారు. విదేశీ విరాళాలు మాత్రం తీసుకోకూడదని.. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)లో నిబంధన విధించింది. అయినప్పటికీ  జాతీయ స్థాయి పార్టీలు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి. చట్ట ఉల్లంఘన చేసిన పార్టీలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ఉత్తర్వులిచ్చాయి. అయినా పాలకులు లెక్క చేయకుండా ఎఫ్‌సీఆర్‌ఏ చట్టాన్ని సవరణ చేయడం దారుణం.. పార్టీలు విదేశీ కంపెనీల నుంచి  విరాళాల కోసం చట్టాలనే సవరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతమే. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు జవాబుదారీ తనంతో వ్యవహరించాలి.
– గరికిపాటి ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం 

మరిన్ని వార్తలు