రాజ్యసభ ముందుకు ఈబీసీ బిల్లు.. విపక్షాల ఆందోళన

9 Jan, 2019 12:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకువచ్చారు. మంగళవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లట్‌ ఎగువ సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో సునాయాసంగా ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలో మాత్రం కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. బిల్లును పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, బిల్లును పార్లమెంట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కీలకమైన బిల్లుపై చర్చించేందుకు తగిన సమయం లేదని, ఇంత హడావిడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు బిల్లును తీసుకువచ్చిందని విపక్ష సభ్యులు పోడియం ముందు ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చించిన డీఎంకే సభ్యురాలు కనిమొళి పలు సవరణలు కోరారు. ఈబీసీ బిల్లుపై గెహ్లట్‌ మాట్లాడుతూ.. సామాజిక సమనత్వం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.

సభ్యుల ఆందోళనతో సభను రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. సభ ప్రారంభమైన అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ బిల్లుపై ప్రసంగించనున్నారు. కాగా 124వ రాజ్యాంగ సవరణకు లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాజ్యసభ కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదం తెలిపితే బిల్లు చట్టరూపం దాల్చనుంది.

మరిన్ని వార్తలు