ఎటూ తేలని ఈబీసీ కోటా?

27 Mar, 2019 12:24 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు రాలేదన్న హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు

సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) వర్తించే 10 శాతం కోటాపై రాష్ట్రంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇటీవలే పార్లమెంటు చట్టం చేస్తూ తెచ్చిన ఈ రిజర్వేషన్ల మేరకు ఈ ఏడాది నుంచే విద్యా, ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పీజీ వైద్య సీట్ల భర్తీ జరుగుతోంది. జాతీయ పూల్‌ సీట్లకు కౌన్సెలింగ్‌ మొదలైంది. అలాగే రాష్ట్రకోటాకు సంబంధించిన సీట్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్‌ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిజర్వేషన్లపై ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో.. గతంలో ఎలా కౌన్సెలింగ్‌ జరిగిందో అలాగే పూర్తిచేసేందుకు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాట్లు పూర్తిచేసింది. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయగానే.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకిచ్చే 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కేటాయిస్తామని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి 2019 మార్చి 8న ఉత్తర్వులు జారీచేశారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో యూనివర్సిటీ అధికారులు పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే..
కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ఇచ్చామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈబీసీ రిజర్వేషన్లపై మార్గదర్శకాలు రాలేదని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డా.అప్పలనాయుడు చెప్పారు. వచ్చే నెల 3 నుంచి రాష్ట్ర కోటా సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగానే అడ్మిషన్లు జరుగుతాయన్నారు. మరోవైపు ప్రభుత్వ తీరుపై ఈబీసీ విద్యార్థులు మండిపడుతున్నారు. ఉత్తర్వులు జారీ చేసి, అమలు చేయకపోతే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు