ఓటరు కార్డుకు రూ. 25కు మించి చెల్లించొద్దు!

22 Nov, 2018 15:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాల ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా ఖరారు చేసింది. ప్రతి జిల్లాకు ఒక్కరి చొప్పున ఎన్నికల పరిశీలకులను నియమించింది.  హైదరాబాద్ ఎన్నికల పరిశీలకుడిగా డీఐజీ రేంజ్ అధికారి అజయ్‌దేవ్ కుమార్‌ నియమితులయ్యారు. ఎన్నికల్లో భద్రత అంశాలపై ఎప్పటికప్పుడు సీఈసీకి పరిశీలకులు సమాచారం ఇవ్వనున్నారు. ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన ప్రత్యేక అధికారులు తెలంగాణలో అన్ని జిల్లాలకు చేరుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతా కట్టుదిట్టం చేశారు. 

రూ. 25కు మించి చెల్లించవద్దు..!
ఓటరు కార్డుకు రూ. 25కు మించి చెల్లించనక్కర్లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. కొత్త ఓటరుగా నమోదయిన వారికి ఇంటిదగ్గర లేదా పోలింగ్ బూత్ వద్ద ఎన్నికల కమిషనే ఉచితంగా కార్డులు అందజేస్తుందని, పాత కార్డుల వారు మాత్రం రూ. 25 మాత్రమే చెల్లించి ‘మీసేవ’లో ఓటరు కార్డులు పొంద వచ్చని ఆయన వెల్లడించారు. 

‘మీ సేవలో’ ఓటరు కార్డుకు రు.100 వసూలు చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందుతున్నాయనీ, ఇలా వసూలు చేయడం అక్రమమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ. 25కు మించి అదనంగా ఎవరైనా వసూలు చేసినపక్షంలో పూర్తి వివరాలతో 1950కి ఫిర్యాదు చేస్తే.. తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొత్త ఓటర్లుగా నమోదు అయిన వారికి ఇళ్ల వద్ద కానీ, పోలింగ్ జరిగే రోజున అయితే  పోలింగ్ కేంద్రం వద్ద కానీ ఎపిక్ కార్డులను ఉచితంగా అంద చేస్తారని వివరించారు.

మరిన్ని వార్తలు