పోలింగ్‌కు 48 గంటల్లోపు మేనిఫెస్టోపై నిషేధం

17 Mar, 2019 04:14 IST|Sakshi

కీలక నిర్ణయం వెలువరించిన ఎన్నికల కమిషన్‌

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించరాదని రాజకీయ పార్టీలకు నిర్దేశించింది. అంతేకాదు, పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోను కూడా ఎన్నికల నియమావళిలో భాగంగా మార్చింది. తాజా నిర్ణయం ప్రకారం.. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్‌–126 ప్రకారం.. ఒకే దఫా లేదా పలు దఫాలుగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలయ్యే సమయంలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టో విడుదల చేయరాదు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి అమలయ్యే ‘ఎన్నికల ప్రశాంత’ సమయంలో ఎటువంటి తరహా ప్రచారం చేయరాదని నిబంధనలు చెబుతున్నాయి’ అని ఎన్నికల సంఘం పేర్కొంది.

దీని ప్రకారం, ఏప్రిల్‌ 11, 18, 23, 29, మే 6, 12, 19వ తేదీల్లో జరిగే పోలింగ్‌కు 48 గంటల్లోపు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడం కుదరదు. కాగా, ఎన్నికల మేనిఫెస్టో విడుదల సమయంపై ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు లేవు. దీంతో, 2014లో మొదటి విడత పోలింగ్‌ రోజునే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ చర్య ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందంటూ కాంగ్రెస్‌ అభ్యంతరం తెలపగా, ఈ విషయమై తుది నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. పోలింగ్‌కు 72 గంటల ముందు పార్టీలు మేనిఫెస్టో ప్రకటించడం సరికాదని ప్రత్యేక కమిటీ ఇటీవలే తన అభిప్రాయాన్ని ఈసీకి తెలిపింది.

మరిన్ని వార్తలు