బెంగాల్‌లో ప్రచారం కుదింపు

16 May, 2019 03:41 IST|Sakshi
ఈశ్వరచంద్ర విగ్రహం ముక్కలను చూస్తున్న మమత, ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న అమిత్‌షా

ఎన్నికల కమిషన్‌ అసాధారణ నిర్ణయం

నేటి రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారం

హోం శాఖ ముఖ్యకార్యదర్శి, సీఐడీ డీజీల తొలగింపు

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచార సమయాన్ని కుదిస్తూ ఎన్నికల కమిషన్‌ (ఈసీ) అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏడో విడత ఎన్నికల ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగియాల్సి ఉండగా, హింసాత్మక ఘటనల నేపథ్యంలో దానిని పశ్చిమ బెంగాల్‌లో మాత్రం గురువారం రాత్రికి కుదిస్తూ ఈసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసీ ఇలాంటి ఉత్తర్వులివ్వడం భారత ఎన్నికల చరిత్రలోనే తొలిసారి. బెంగాల్‌లో గురువారం రాత్రి 10 గంటలకు ప్రచార గడువు ముగుస్తుందని డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ చంద్ర భూషణ్‌ తెలిపారు.

బెంగాల్‌లోని 9 నియోజకవర్గాలకు ఆదివారం చివరి విడత పోలింగ్‌ జరగనుంది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ర్యాలీ సందర్భంగా బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకోవడం తెలిసిందే. బెంగాల్‌లో హోం శాఖ ముఖ్య కార్యదర్శి అత్రి భట్టాచార్య, సీఐడీ అదనపు డీజీ రాజీవ్‌లను పదవుల నుంచి తొలగించాలని ఈసీ ఆదేశించింది. చంద్ర మాట్లాడుతూ ‘రాజ్యాంగబద్ధమైన అధికారాలతో ప్రచారం గడువును ఈసీ తగ్గించడం ఇదే తొలిసారి. కానీ ఇదే చివరిసారి కాదు’ అని అన్నారు.

పశ్చిమ బెంగాల్‌ ఇన్‌చార్జ్‌గా ఉన్న మరో ఉప కమిషనర్‌ సుదీప్‌ జైన్‌ మాట్లాడుతూ భట్టాచార్య బెంగాల్‌ ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారనీ, అందువల్లే ఆయనను బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు, అభ్యర్థులందరికీ సమానావకాశాలు కల్పించేందుకు అవసరమైన సహకారం రాష్ట్ర అధికారుల నుంచి దక్కడం లేదని కేంద్ర ఎన్నికల పరిశీలకులు తమ దృష్టికి తెచ్చినట్లు ఈసీ వెల్లడించింది. ‘ఎన్నికలు అయిపోగానే కేంద్ర బలగాలు వెళ్లిపోతాయి. ఇక్కడ ఉండేది మేమే’ అంటూ టీఎంసీ సీనియర్‌ నేతలు ఓటర్లను భయపెడుతున్నారని పరిశీలకులు తమకు చెప్పారంది. తత్వవేత్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ విగ్రహం ధ్వంసం కావడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఈసీ, దుండగులను త్వరలోనే పట్టుకుంటారని తాము ఆశిస్తున్నట్లు పేర్కొంది.

మోదీ కోసమే: కాంగ్రెస్, సీపీఎం
ప్రచారం గడువును తగ్గించాల్సినంత తీవ్రమైన పరిస్థితులు బెంగాల్‌లో ఉంటే బుధవారం రాత్రికే ప్రచారానికి ఈసీ తెరదించాల్సిందని కాంగ్రెస్‌ పేర్కొంది. బెంగాల్‌లో గురువారం ప్రధాని మోదీ ప్రచారం చేయాల్సి ఉందనీ, ఆయన కార్యక్రమానికి ఆటంకం కలగకూడదనే గురువారం రాత్రి ప్రచారాన్ని ముగించాలని ఈసీ ఆదేశాలిచ్చిందంటూ కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఆరోపించారు. బెంగాల్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని ఈసీ చెబుతూ కూడా మోదీ సభలు పూర్తయ్యే వరకు ప్రచారానికి అనుమతి ఇస్తోందనీ, ఈసీ ఇలా చేయడం కూడా గతంలో ఎన్నడూ లేదంటూ పటేల్‌ ఓ ట్వీట్‌ చేశారు. మోదీ సభల కోసమే గడువును గురువారం రాత్రి 10 గంటల వరకు ఈసీ ఇచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా ఆరోపించారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం సాయంత్రం ముగుస్తుందనీ, మరి ఇప్పుడు గురువారం అంటే గురువారం సాయంత్రం కాకుండా రాత్రి 10 గంటలక వరకు ఈసీ ఎందుకు సమయం ఇస్తోందని ఏచూరి ప్రశ్నించారు.

మోదీకి ఈసీ ఇచ్చిన బహుమతి: మమత
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం గడువును ఎన్నికల సంఘం (ఈసీ) కుదించడం రాజ్యాంగ విరుద్ధమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగవిరుద్ధ, అనైతిక బహుమతిని ప్రధాని మోదీకి ఈసీ ఇచ్చిందని మమత ఆరోపించారు. పూర్తిగా ఆరెస్సెస్‌ మనుషులతో నిండిపోయిన ఇలాంటి ఈసీని తానెన్నడూ చూడలేదని ఆమె పేర్కొన్నారు. ‘324 అధికరణాన్ని ఉపయోగించాల్సినంతగా బెంగాల్‌లో శాంతి భద్రతల సమస్యేమీ లేదు. ఇద్దరు అధికారులను తొలగించాలని ఆదేశించింది ఈసీ కాదు. మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా’ అని మమత ఆరోపించారు. రాజ్యాంగంలోని 324వ అధికరణాన్ని ఉపయోగించి బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఈసీ ఒకరోజు కుదించింది.
ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ చేస్తూ ‘బెంగాల్‌లో అరాచకత్వం ఉందని రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. ప్రతిసారి హింస పెరగడం, రాష్ట్ర ప్రభుత్వమే పంపిన విధ్వంసకారులు, పక్షపాతంతో వ్యవహరించే పోలీసులు, హోం శాఖల గురించి ఈసీ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది’ అని అన్నారు.

ఆర్టికల్‌ 324 ఏం చెబుతోందంటే..
దేశంలో పార్లమెంటుకు, అన్ని శాసనసభలకు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు జరిగే అన్ని ఎన్నికలను నిర్వహించేందుకు, నియంత్రించేందుకు ఈసీకి అధికారాన్ని రాజ్యాంగంలోని 324వ అధికరణం ఇస్తోంది. ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని పరిపాలనాపరమైన పనులను ఈసీ ఈ అధికరణం కింద చేస్తుంది. ఎన్నికల నిర్వహణలో అవసరమైన పరిపాలన, న్యాయ, శాసనపరమైన పనులను అన్నింటినీ ఈసీయే చూసుకుంటుంది. ఈ అధికారాలను వాడే బెంగాల్‌లో ప్రచారం గడువును ఈసీ కుదించింది.

మరిన్ని వార్తలు