ఎమ్మెల్యేనైన నా ఓటే తొలగిస్తారా!

7 Mar, 2019 07:33 IST|Sakshi

ఎమ్మెల్యేనైన నా ఓటే తొలగిస్తారా!

సాక్షి, యాదమరి(చిత్తూరు జిల్లా): ఎమ్మెల్యే ఓటే తొల గించాలని దరఖాస్తు వస్తే..  ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ సునీల్‌ కుమార్‌ బుధవారం మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ప్రైవేటు ఐటీ కంపెనీల ద్వారా సామాన్య ఓటర్లవే కాక, నియోజకవర్గ ఎమ్మెల్యే ఓటు కూడా తీసేయాలని దరఖాస్తు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. నియోజక వర్గంలోని ఐరాల మండలం పైపల్లె గ్రామానికి చెందిన డాక్టర్‌ సునీల్‌కుమార్‌ గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఓట్ల తొలగింపు కోసం ఆన్‌లైన్‌లో వేల కొద్దీ ఫారం–7 దరఖాస్తులు రావడంతో ఎమ్మెల్యే ధర్నాలు చేశారు,  కానీ చివరకు ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు రావడంతో ఆయన అవాక్కయ్యారు. అధికారులు పరిశీలించి ఫారం–7ను తిరస్కరించారు. ఎమ్మెల్యే ఓటు తీసేయాలని దరఖాస్తు చేసిన వ్యక్తిని బుధవారం ఎన్నికల అధికారులు, పోలీసులు విచారించారు. చివరకు అతను ‘‘నేను వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌ను. నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దరఖాస్తు చేయలేదు’’ అని  చెప్పారు. దీనిపై అధికారులు పోలీసులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పెట్టిన వారి ఐపీ అడ్రస్‌ ఆధారంగా పరిశీలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు