హెరిటేజ్‌​ పాలవ్యాన్‌లో నగదు పట్టివేత

4 Apr, 2019 18:28 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న కొద్ది టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఇందుకోసం భారీగా డబ్బు పంచడంతో పాటు, మద్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లకు డబ్బు, మద్యం చేర్చేందుకు పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు. డబ్బు తరలిస్తున్నట్టు ఎవరికి అనుమానం రాకూడదనీ కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్‌ సంస్థ పాల వ్యాన్‌లను వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ నేతలకు చెందిన నగదు, మద్యాన్ని ఎనిక్నల అధికారులు పట్టుకున్నారు.

విశాఖ జిల్లా మాకవరపాలెంలో హెరిటేజ్‌ పాల వ్యాన్‌లో తరలిస్తున్న 3.95లక్షల రూపాయల నగదును పోలీసులు, ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. విశాఖలో డబ్బులు పంచేందుకు టీడీపీ నేతలు ఈ డబ్బును తరలిస్తున్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. వ్యాన్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడులో ఎన్నికల తనిఖీల్లో భాగంగా టీడీపీ నాయకుల నుంచి 59,300 రూపాయల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 35 కవర్లలో వెయ్యి రూపాయల చొప్పున ప్యాక్‌ చేసి ఉండటంతో అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తంతోపాటు, మారుతి బ్రీజా కారును స్వాధీనం చేసుకున్న అధికారులు.. టీడీపీకి చెందిన దాసరి అప్పన్న , మట్టా సత్యనారాయణలను అదుపులోకి తీసుకున్నారు. దాసరి అప్పన్న డీసీసీబీ డైరక్టర్‌గా,ముదునూర్‌ సొసైటీ ప్రెసిడెంట్‌గా పనిచేస్తుండగా.. మట్టా సత్యనారాయణ పెంటపాడు బీసీ సెల్‌ అధ్యక్షునిగా ఉన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కొనుగోలు చేయడం కోసమే ఈ నగదును తరలిస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కృష్ణా జిల్లా ముసునూరు మండలం వెంకటాపురం వద్ద పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. మండల టీడీపీ నాయకుడికి చెందిన వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా తరలిస్తున్న వెయ్యి మద్యం సీసాలను స్వాధీనం చేసకున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ట్రాక్టర్‌ డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా, టీడీపీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి రూప కోసం హైదరాబాద్‌ నుంచి డబ్బు తరలిస్తున్న జయభేరి ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు వారి వద్ద నుంచి  2 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు