అసమ్మతిని ప్రస్తావించం

22 May, 2019 01:44 IST|Sakshi

లావాసా డిమాండ్‌ను 2–1 మెజారిటీతో తిరస్కరించిన ఈసీ

న్యూఢిల్లీ: ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కేసులకు సంబంధించిన తీర్పుల ఉత్తర్వుల్లో అసమ్మతి వివరాలను కూడా చేర్చాలంటూ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా చేసిన డిమాండ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం 2–1 మెజారిటీ ఓటుతో తిరస్కరించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరా, కమిషనర్లు సుశీల్‌ చంద్ర, లావాసాలతో కూడిన ఈసీ కమిటీ ఈ వివాదాస్పద విషయంపై చర్చించింది. అనంతరం ఈసీ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘ఎన్నికల నిబంధనావళి అంశంపై ఈసీ సమావేశం మంగళవారం జరిగింది. కమిషనర్లందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటాం. అసమ్మతి, మైనారిటీ అభిప్రాయాలను రికార్డు చేసినప్పటికీ ఉత్తర్వుల్లో వాటిని పేర్కొనం’ అని తెలిపింది.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాపై వచ్చిన ఫిర్యాదులపై చర్యల సమయంలో తన అసమ్మతిని పరిగణనలోనికి తీసుకోవడం లేదనీ, కాబట్టి ఇకపై తాను ఈ తరహా సమావేశాలకు వెళ్లదలచుకోవడం లేదని అశోక్‌ లావాసా ఇటీవల ప్రకటించడం తెలిసిందే. తాజా సమావేశంలోనూ లావాసా తన వాదనకు కట్టుబడగా, ప్రధాన కమిషనర్, మరో కమిషనర్‌ ఆయన వాదనను తోసిపుచ్చారు. ఈ సమావేశం అనంతరం లావాసా మాట్లాడుతూ పారదర్శకతే ప్రధానమని తాను ఇప్పటికీ నమ్ముతున్నానని అన్నారు. నిబంధనావళి ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే ప్రక్రియ నిర్దిష్ట గడువులోగా పూర్తయ్యేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు