మోదీ బయోపిక్‌కు బ్రేక్‌

11 Apr, 2019 04:49 IST|Sakshi

ఎన్నికలు పూర్తయ్యే వరకు విడుదల చేయరాదన్న ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ’చిత్ర విడుదలకు బ్రేక్‌ వేసింది. దేశంలో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు రాజకీయ నాయకుల బయోపిక్‌లను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఆదేశించింది. దీంతో గురువారం (11న) విడుదల కావాల్సిన మోదీ బయోపిక్‌ వాయిదాపడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ బయోపిక్‌ విడుదలను నిలిపివేయాలని కోరుతూ.. కాంగ్రెస్‌ కార్యకర్త ఒకరు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు చిత్రం విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సినిమా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే తాజాగా ఈసీ ఆదేశాలతో సినిమా విడుదల వాయిదా పడింది. కాగా ఇదే నిబంధనలు ‘నమో టీవీ’ విషయంలోనూ వర్తించే అవకాశం ఉందని ఎన్నికల ప్యానెల్‌ అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో నమో టీవీలో ప్రసారాలు నిలిపివేయాలన్నారు. ఈసీ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి సంబంధించిన విషయాలను పోస్టర్‌ లేదా సినిమాల రూపంలో ఎలక్ట్రానిక్‌ మీడియాలో
ప్రచారం చేయకూడదు.  

మోదీ బయోపిక్‌కు ‘యూ’సర్టిఫికెట్‌..
పీఎం నరేంద్ర మోదీ సినిమాకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ‘యూ’సర్టిఫికెట్‌ ఇచ్చింది. సినిమాకు యూ సర్టిఫికెట్‌ రావడంపై చిత్ర నిర్మాత సందీప్‌æ సంతోషం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ హీరో వివేక్‌ ఒబేరాయ్‌ ఈ చిత్రంలో మోదీగా నటించారు.

మరిన్ని వార్తలు