వీడని ఉ‍త్కంఠ.. శివసేన కీలక నిర్ణయం

31 Oct, 2019 14:22 IST|Sakshi

శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాథ్‌ షిండే

నేడు గవర్నర్‌తో ఎమ్మెల్యేల భేటీ

ఉత్కంఠగా మారిన మహారాష్ట్ర రాజకీయం

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ-శివసేన కూటమి మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. సీఎం కుర్చి మాదంటేమాదేనని రెండు పార్టీలు మాటాల యుద్ధానికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, ఏక్‌నాథ్‌ షిండేను శివసేన శాసనసభాపక్ష నేత ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తొలుత షిండే పేరును ఆదిత్యా ఠాక్రే ప్రతిపాదించగా.. దానికి ఎమ్మెల్యేలంతా ఆమోదం తెలిపారు. అలాగే తమ ఎమ్మెల్యేతో ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు గవర్నర్‌ భగత్‌సింగ్‌ను కలువనున్నారు. ఈ బృందంలో పార్టీ ఎమ్మెల్యేలు ఆదిత్యా ఠాక్రే, ఏక్‌నాథ్‌ షిండే, దివాకర్‌ రౌత్‌, సుభాష్‌ దేశాయ్‌లు ఉన్నట్లు శివసేన తెలిపింది. కాగా ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం తొలిసారి సమావేశమైన శివసేన.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించింది. ముఖ్యంగా సీఎం బీజేపీకి మద్దతు ప్రకటించాలా? లేదా అ‍న్న అంశంపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే భవిష్యత్తు కార్యచరణ కూడా శివసేన రూపొందించినట్లు సమాచారం.

మరోవైపు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు దేవేంద్ర ఫడ్నవిస్‌ సిద్ధమవుతున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఆయనను పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో రేపో, ఎల్లుండో సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తమ డిమాండ్ల మేరకు బీజేపీ దిగిరాకపోవడంతో శివసేన మరింత మొండి పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తోంది. తాము లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానిస్తోంది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 105, శివసేన 56 సీట్లు గెలుచుకున్నాయి. ప్రతిపక్ష ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు కైవలం చేసుకున్నాయి. 17మంది బీజేపీ రెబల్స్‌ గెలువడంతో వారి మద్దతు తమకే ఉంటుందన్న ధీమాతో ఉన్న బీజేపీ శివసేన డిమాండ్లను పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు కాషాయపార్టీల నడుమ ఎలాంటి డీల్‌ కుదురుతుందని, ఎవరు రాజీపడతారు? లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసినా.. మళ్లీ కలహాల కాపురమే అవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా