ప్రచార రూపా(య)లెన్నో!

16 Mar, 2019 12:42 IST|Sakshi
బీజేపీ వాణిజ్య ప్రకటన

ఎన్నికల షెడ్యూలు విడుదలకు ముందే చాలా రాజకీయ పార్టీలు పత్రికల్లో, టీవీల్లో ఎన్నికల ప్రకటనలు మొదలు పెట్టేశాయి. రెండు నెలల పాటు సాగే ఈ ఎన్నికల కోసం వివిధ రాజకీయ పార్టీలు చేసే ప్రకటనల వ్యయం దాదాపు రూ.4 వేల కోట్ల వరకు ఉంటుందని మీడియా వర్గాల అంచనా. ఇది 2014 ఎన్నికల ప్రకటనల ఖర్చు కంటే 40 శాతం ఎక్కువ. ఎన్నికలకు ముందు జారీ చేసే ప్రకటనల రేట్లను ఇతర కార్పొరేట్‌ ప్రకటనల రేటుతో పోలిస్తే 100 శాతం పెంచేశారని ఐపీజీ మీడియా బ్రాండ్స్‌ సంస్థ సీఈవో శశి సిన్హ చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాజకీయ పార్టీలు పెరిగాయని అభ్యర్థులూ బాగా పెరిగారని దానివల్ల ప్రకటనల వ్యయం కూడా పెరుగుతుందని ఆయన వివరించారు. ఎన్నికల సమయంలో వార్తా చానళ్లు చూసే వారి సంఖ్య 18 నుంచి 20 శాతం పెరుగుతుందని, దానివల్ల ఆ చానళ్ల ప్రకటన రేట్లు కూడా 25 నుంచి 40 శాతం వరకు పెరుగుతాయని జీ ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఉన్నతాధికారి ఆశిష్‌ సెహగల్‌ తెలిపారు. ఈసారి ఎన్నికలకు మొత్తం రూ.50 వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అంచనా వేసింది.

యూట్యూబ్‌ రేటు రూ.1.4 కోట్లు
యూట్యూబ్‌ ప్రస్తుతం ఒకరోజు హోం పేజీ ప్రకటనకు రూ.70 లక్షలు వసూలు చేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఈ రేటును గత జనవరి నుంచి రూ.1.4 కోట్లకు పెంచేసింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లు కూడా ప్రకటనల రేట్లను 20 నుంచి 30 శాతం పెంచాయి. డిజిటల్‌ మీడియా ప్రచారం రోజుకు 100 కోట్ల మంది చూస్తారని, ఖర్చు రోజుకు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా.

ఈ ప్రధానులు ‘భారతరత్నా’లు


దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇంత వరకు 15 మంది ప్రధానమంత్రులుగా పని చేశారు. వారిలో ఏడుగురు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను అందుకున్నారు. వీరిలో ప్రథమ ప్రధాని నెహ్రూ.. మొదటి భారతరత్న అందుకున్న ప్రధానిగానూ మొదటి వరుసలో నిలిచారు. చివరిసారిగా భారతరత్న అందుకున్న ప్రధాని వాజపేయి.

పేరు                            సంవత్సరం
జవహర్‌లాల్‌ నెహ్రూ     1955
లాల్‌ బహదూర్‌ శాస్త్రి     1966
ఇందిరా గాంధీ               1971
రాజీవ్‌ గాంధీ                 1991
మొరార్జీ దేశాయ్‌            1991
గుల్జారీలాల్‌ నందా         1997
అటల్‌ బిహారీ వాజపేయి  2015 

మరిన్ని వార్తలు