అధికార పార్టీ కాలనీకి పోలింగ్‌ బూత్‌ మార్చారు..

9 Mar, 2019 12:04 IST|Sakshi
ఎన్నికల బూత్‌: ప్రతీకాత్మక చిత్రం

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోలేం

హైకోర్టును ఆశ్రయించిన బడుగు వర్గాల మహిళ

వివరణ ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారికి హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా, నర్సరావుపేట నియోజకవర్గ పరిధిలోని రొంపిచర్ల గ్రామంలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న బీసీ కాలనీలోని పోలింగ్‌ బూత్‌ను, అధికార పార్టీకి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి మార్చడంపై హైకోర్టు శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారిని వివరణ కోరింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వతేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

తమ ప్రాంతంలో పోలింగ్‌ బూత్‌  ఏర్పాటు చేశారని, అయితే ఇప్పుడు దానిని అధికార పార్టీకి చెందిన అగ్రకులాల వారు ఉన్న ప్రాంతానికి మార్చారని, దీని వల్ల తాము స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండదంటూ దానమ్మ అనే మహిళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్యాంసుందర్‌ వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారం ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్న చోటే పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఇందుకు అనుగుణంగానే బీసీ కాలనీలో పోలింగ్‌ బూత్‌ ఉండేదని, ఇప్పుడు దానిని వేరే చోటుకు మార్చారన్నారు. అగ్రవర్ణాలు ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి పోలింగ్‌ బూత్‌ను మార్చారని, దీని వల్ల స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదని తెలిపారు. తరువాత ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ..పిటిషనర్‌ది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. తహసీల్దార్‌ నివేదిక ఇచ్చిన తరువాతనే పోలింగ్‌ బూత్‌ను మార్చారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కౌంటర్‌ రూపంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు