ఎన్నికల హడావుడి    

18 Jun, 2018 12:45 IST|Sakshi
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు  

పావులు కదుపుతున్న ప్రధాన పార్టీలు

ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు

బరంపురం : రాష్ట్రంలో పురపాలక, సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. దీంతో ప్రధాన పార్టీలైన బీజేడీ, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ప్రచారాలను వివిధ రూపాల్లో మొదలుపెట్టారు. రాష్ట్రంలో ముఖ్యమైన గంజాం జిల్లాను కేంద్రంగా చేసుకుని ప్రధాన పార్టీ నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అధికార బీజేడీ పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

మరో వైపు భారతీయ జనతా పార్టీ 17 ఏళ్ల బీజేడీ పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలను వెలికితీసి ప్రజలకు తెలియజేసేందుకు వరుస ఆందోళనలు చేపడుతూ తమదైన రీతిలో ప్రచారం చేస్తోంది. అలాగే కేంద్రంలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మూడు నెలలుగా గంజాం జిల్లాలో బీజేపీ వివిధ అంశాలపై పలు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తోంది.

ఈ రెండు పార్టీలకు దీటుగా తనూ తక్కువేమీ కాదంటూ కాంగ్రెస్‌ పార్టీ తనదైన శైలిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలన పట్ల విమర్శలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్‌ ధరలను ప్రధాన అస్త్రంగా చేసుకుంటూ బీజేపీపై విరుచుకుపడుతోంది. అలాగే నవీన్‌ పట్నాయక్‌ పాలనలో అవినీతి పెరిగి, అభివృద్ధి జరగలేదంటూ ఆందోళనలు చేపడుతోంది. మరో వైపు అధికార బీజేడీ పార్టీ ప్రతిపక్ష నాయకులకు గాలం వేసి తమ పార్టీలో చేర్చుకుంటూ దూసుకుపోతుంది.

ఇటీవల జిల్లాలో పలువురు కాంగ్రెస్‌ నాయకులను పార్టీలోకి చేర్చుకున్న సంఘటనలే ఉదాహరణ. ఇటీవల రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించినా ఓట్ల శాతం తగ్గడం, బీజేపీ ఓట్ల శాతం పెరిగి రెండో స్థానంలో నిలవడంతో బీజేడీ పార్టీకి మింగుడపడడం లేదు. మరో వైపు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న గంజాం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల గెలిచినా ఓట్ల శాతం తగ్గి మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు పీసీసీ అధ్యక్ష పదవిని కొత్త వారికి అప్పగించి యువ నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపింది. మరో 5 నెలల్లో జరగనున్న మున్సిపల్, ఎన్‌ఏసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేడీ, బీజేడీ కాంగ్రెస్‌ పార్టీలు పావులు కదుపుతున్నాయి.  

>
మరిన్ని వార్తలు