సమయమింకా.. ఐదు రోజులే మిత్రమా..! 

5 Apr, 2019 11:47 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రచార గడువు సమీపిస్తోంది. మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉంది. 9వ తేదీ సాయంత్రం ప్రచారం పరిసమాప్తం కానుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలను చుట్టుముట్టి వచ్చారు. అయినా ఏదో అసంతృప్తివారిలో నెలకొంది. కారణం ఇప్పటికీ ఇంకా అనేక గ్రామాలు తిరగాల్సి ఉండడంతో లోలోపల మదనపడుతున్నారు. పట్టణాల్లో ప్రచారం అలాగే మిగిలి ఉంది. మరోవైపు ఎండ దంచికొడుతుండడంతో ఎలా ప్రచారం చేయాలో అంతుచిక్కని పరిస్థితి నెలకొంది. 

పలు నియోజకవర్గాలు..
ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో చెరో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆదిలాబాద్‌ పరిధిలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పూర్‌ ఉండగా.. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, ధర్మపురి, మంథని, రామగుండం, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయాపార్టీ అభ్యర్థులు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించారు. 

టీఆర్‌ఎస్‌ విస్తృతంగా..
ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, కేడర్‌ బలంగా ఉండడంతో ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది. ఆదిలా బాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గోడం నగేశ్, బోర్లకుంట వెంకటేశ్‌ నేత విజయం కోసం మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌కు సీఎం కేసీఆర్‌ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారిరువురు ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ఆదిలాబాద్‌ నుంచి మాజీమంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న, సిర్పూర్‌ నుంచి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వంటి సీనియర్‌ నేతలు ఉండడం.. వారి అనుభవంతో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుండడం కలిసివచ్చే అంశం.

ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్, ముథోల్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆత్రం సక్కు, రాథోడ్‌ బాపూరావు, రేఖానాయక్, విఠల్‌రెడ్డికి నియోజకవర్గాలపై పట్టు ఉండడంతోపాటు అన్నిచోట్లా కేడర్‌ బలంగా ఉండడంతో ప్రచారం విస్తృతంగా సాగిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఎమ్మెల్యే దివాకర్‌రావు వంటి సీనియర్‌ నేతలు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. చెన్నూర్‌లో ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పెద్దపల్లి ఎంపీగా చేసిన అనుభవం దృష్ట్యా ఆ పార్టీ అభ్యర్థి వెంకటేశ్‌నేతకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు అన్ని మండలాల్లో పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్‌ కరపత్రాలను ఇంటింటా పంచుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

కాంగ్రెస్‌ విశ్వ ప్రయత్నాలు..
కాంగ్రెస్‌ పార్టీ ఆదిలాబాద్, పెద్దపల్లి స్థానాల నుంచి అనుభవానికి పెద్దపీట వేస్తూ రాథోడ్‌ రమేశ్, ఎ.చంద్రశేఖర్‌ను అధిష్టానం అభ్యర్థులుగా బరిలో నిలిపింది. రాథోడ్‌ రమేశ్‌ గతంలో ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్మన్‌గా, ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్‌ ఎంపీగా పనిచేయడంతో ఆయనకు ఈ పార్లమెంట్‌ స్థానాల్లో పరిచయాలు అధికంగా ఉన్నాయి. పెద్దపల్లి నుంచి చంద్రశేఖర్‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. వికారాబాద్‌కు చెందిన ఈయనకు పెద్దపల్లి ఎంపీ స్థానం కేటాయించడం గమనార్హం. ఇక ప్రచార పర్వంలో రాథోడ్‌ రమేశ్‌ ఆదిలాబాద్‌లో మాజీమంత్రి సి.రాంచంద్రారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్‌ సుజాత, డీసీసీ అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌ పాండే, నిర్మల్‌లో ఉమ్మడి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు రామారావు రాథోడ్, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన హరిశ్‌రావును కలుపుకుని ఆయా జిల్లాల్లోని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

గతంలో ఆసిఫాబాద్‌ జెడ్పీటీసీగా..  ఖానాపూర్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆ రెండు నియోజకవర్గాల్లో రాథోడ్‌ రమేశ్‌ ప్రచార విస్తృతిని పెంచారు. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లిల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సరళిని పెంచింది. బుధవారం ఆ పార్టీ స్టార్‌ క్యాంపెనర్‌ విజయశాంతి రోడ్‌ షో నిర్వహించడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మంచిర్యాలలో కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, సురేఖ, మంథని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కాంగ్రెస్‌ అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

బీజేపీ ఆశలు..
బీజేపీ నుంచి ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థులుగా సోయం బాపూరావు, ఎస్‌.కుమార్‌ పోటీ చేస్తున్నారు. సోయం బాపురావుకు గతంలో బోథ్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయన ప్రచారంలో పార్టీ శ్రేణులను కలుపుకుని వెళ్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో ఆ పార్టీ సీనియర్‌ నేతలు పాయల్‌ శంకర్, సుహాసినీరెడ్డి, రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమన్న, పడకంటి రమ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివాసీ ఉద్యమంలో ఉన్న సోయం బాపూరావు ప్రధానంగా కుమురంభీం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పెద్దపల్లి నుంచి ఎస్‌.కుమార్‌ బీజేపీ సీనియర్‌ నేతలను కలుపుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. 

పట్టణాలపై దృష్టి..
25న నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం ముగిసినప్పటినుంచి ప్రధాన పార్టీ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రచార సరళిని మొదలుపెట్టారు. నిర్మల్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ శుక్రవారం భైంసా, ఇచ్చోడ, ఆదిలాబాద్, నిర్మల్‌ రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటనపై బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు పట్టణ ప్రాంత ఓట్లపై భరోసా పెట్టుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో కూడా ఈ ఐదు రోజుల్లో వివిధ పార్టీల ముఖ్య నాయకులు పర్యటించే అవకాశాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు