ప్రచార హోరు వాహనాల జోరు...!

4 May, 2018 06:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘కన్నడ’ నాట ఊపందుకున్న  ప్రచార పర్వం...

అత్యధిక సంఖ్యలో వాహనాలు, ర్యాలీలతో కాంగ్రెస్‌

హెలికాప్టర్‌ ప్రచారంలో ముందున్న బీజేపీ

పోటాపోటీగా నిలుస్తున్న జేడీ(ఎస్‌)

కన్నడ నాట ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. త్రిముఖ పోటీ నేపథ్యంలో ప్రధానపార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్‌) ఒకదానిని మించి మరొకటి ప్రచారవ్యూహాలు అమలు చేస్తున్నాయి. హంగ్‌  ఏర్పడవచ్చన్న ఊహాగానాల మధ్య ఈ పార్టీల ప్రచారం  తారాస్థాయికి చేరుకుంటోంది. ఎత్తులకు పై ఎత్తులు, వినూత్న తరహా ప్రచార సరళితో అందుబాటులో ఉన్న వనరులు ఉపయోగించుకుంటున్నాయి. ఉధృత ప్రచారంతో ఏ ఎన్నికల్లోనైనా బీజేపీ  ముందు వరసలో నిలుస్తుందన్న భావనకు భిన్నంగా కర్ణాటకలో మాత్రం ర్యాలీల నిర్వహణ, తదితర రూపాల్లో కాంగ్రెస్‌ ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది.

ప్రచారానికి అత్యధిక సంఖ్యలో  వాహనాల వినియోగంతో  పాటు,  మిగతా పార్టీల కంటే ఎక్కువ సంఖ్యలో  వీధి మూల  సమావేశాలతో (కార్నర్‌ మీటింగ్‌లు)  ముందుకు సాగుతోంది. ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాహనాలు కూడా ఇందులో ఉన్నాయి.  ఆ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో  ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఇతర స్టార్‌ క్యాంపెయినర్లు  ప్రచారం నిర్వహించేందుకు వీలుగా అత్యధికంగా హెలికాప్టర్లను ఉపయోగించే విషయంలో మాత్రం బీజేపీ ఇతర పార్టీలను అధిగమించింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ హెలికాప్టర్లు దిగేందుకు వీలుగా ఎన్నికల సంఘాన్ని కోరుతూ  బీజేపీ అత్యధికంగా అనుమతులు కోరింది. మరోవైపు జేడీ(ఎస్‌) అధినేత, ముఖ్యనేతలు సైతం ఆరోగ్యపరమైన, ఇతర సమస్యల కారణంగా  హెలికాప్టర్లను ఎక్కువగా ఉపయోగిస్తుండడంతో వీటి వినియోగం విషయంలో ఆ పార్టీ బీజేపీ తరువాతి స్థానాన్ని ఆక్రమిస్తోంది. ఈ విషయంలో  కాంగ్రెస్‌ మూడోస్థానంతో సరిపుచ్చుకుంది. అయితే అత్యధిక సంఖ్యలో ర్యాలీలు, బహిరంగసభల నిర్వహణలో కాంగ్రెస్‌ అగ్రభాగాన నిలుస్తోంది.

కార్నర్‌ మీటింగ్‌ల జోరు...

 భారీ బహిరంగసభల ద్వారానే  అధిక  ప్రయోజనం పొందవచ్చనే రాజకీయవర్గాల్లో ఏర్పడిన భావనకు భిన్నంగా  కర్ణాటకలో నిర్వహిస్తున్న ‘కూడలి సమావేశాల’ ద్వారా ఎక్కువ మంది ప్రజలను కలుసుకోగలుగుతున్నట్టు ఓ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పేర్కొన్నారు. ఈ పద్ధతిని పార్టీ అధినేత రాహుల్‌గాంధీ ఎక్కువగా అనుసరిస్తున్నారని, కర్ణాటక ఎన్నికల్లో ఇది పెద్ద హిట్‌ అయ్యిందని అంటున్నారు. ప్రజలను అతి దగ్గరగా కలుసుకునే అవకాశంతో పాటు  ప్రచారంలో భాగంగా వీధి చివర్లలో ఎక్కడికక్కడ నిర్వహించడం వల్ల వ్యయ ప్రయాసలు తగ్గుతున్నాయి.

కొద్ది మంది ప్రజలే ఉండడం వల్ల భద్రతాపరమైన సమస్యలు రావడం లేదని, ప్రజలతో నాయకులు కలగలిసిపోతుండడం ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి వివిధ పార్టీలు అనుసరిస్తున్న ప్రచార సరళి, వినియోగిస్తున్న వనరులకు సంబంధించి  కేంద్ర ఎన్నికల సంఘం వద్దనున్న సమాచారం మేరకు...వాహనాలు, ర్యాలీలు, రోడ్‌షోలు, వీధి చివరి వీధి చివరి మీటింగ్‌ల నిర్వహణలో మిగతా రెండుపార్టీల కంటే కాంగ్రెస్‌ ముందుంది.

ఆయా పార్టీలు అనుసరిస్తున్న ప్రచార పద్ధతులు, వివిధ వనరుల వినియోగం ఇలా...

రాజకీయపార్టీ    వాహనాలు        ర్యాలీలు        రోడ్‌షోలు        కార్నర్‌మీటింగ్‌లు    హెలికాప్టర్లు
కాంగ్రెస్‌              1,450             1,006               392                   518                  10
బీజేపీ                1,337                496               295                   209                  51
జేడీఎస్‌             1,022                 244              216                    192                  14    

–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

మరిన్ని వార్తలు