నకిలీ ఓటరు కార్డుల కలకలం

10 May, 2018 02:27 IST|Sakshi

రాజరాజేశ్వరి నియోజకవర్గంలో 10వేల కార్డులు స్వాధీనం

విచారణలో అన్నీ తేలుతాయన్న కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కుతోంది. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నియోజకవర్గంలో దాదాపు 10వేల నకిలీ ఓటరు గుర్తింపుకార్డులు దొరకటం సంచలనం సృష్టించింది. మంజుల అనే ఓ మహిళ పేరుతో రిజిస్టర్‌ అయి ఉన్న అపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న నకిలీ కార్డుల ప్రింటింగ్‌ వ్యవహారం బట్టబయలైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా, ఇవి అసలైన కార్డుల్లాగే కనబడుతున్నాయని అయితే విచారణలోనే అసలు విషయాలు వెల్లడవుతాయని కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి సంజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ‘ఇదే కాంగ్రెస్‌ సిద్ధాంతం.

ఓటర్లు వారికి ఓటేయకపోతే.. నకిలీ ఓటర్లను సృష్టిస్తారు. స్థానిక సిట్టింగ్‌ ఎమ్మెల్యే మునిరత్న నాయుడే ఈ రాకెట్‌ వెనక ఉన్నారు’ అని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ ఆరోపించారు. ఇక్కడి ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఖండించారు. ఆ ఫ్లాట్‌ యజమాని మంజుల నంజమారి, పట్టుబడిన రాకేశ్‌లకు బీజేపీతో సత్సంబంధాలున్నాయని ఆరోపించారు. అటు కాంగ్రెస్‌ బృందం ఈ ఘటనపై ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల వి వాదంలో కాంగ్రెస్‌ను క్షమించొద్దని మోదీ అన్నారు.

మరిన్ని వార్తలు