ఎన్నికల జాతర షురూ

7 Oct, 2018 02:40 IST|Sakshi
షెడ్యూలు ప్రకటిస్తున్న సీఈసీ ఓపీ రావత్‌. చిత్రంలో కమిషనర్లు సునీల్‌ అరోరా, అశోక్‌ లావాసా

5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన ఈసీ

కర్ణాటకలో మూడు లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలకు కూడా

ఈసీ మీడియా సమావేశం ఆలస్యం కావడంపై విమర్శలు

న్యూఢిల్లీ: తదుపరి లోక్‌సభ ఎన్నికలకు రిహార్సల్స్‌గా భావిస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల శాసన సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. మావోయిస్టుల సమస్య కారణంగా ఛత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో, మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఒకే దఫాలో పోలింగ్‌ జరుగుతుంది. అసెంబ్లీని రద్దుచేసినప్పటి నుంచే తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాక్షికంగా అమల్లోకి రాగా, శనివారం నుంచి 5 రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకానుంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్‌ 12, 20 తేదీల్లో పోలింగ్‌ జరుగుతుంది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న 18 స్థానాల్లో నవంబర్‌ 12న, మిగిలిన 72 స్థానాల్లో నవంబర్‌ 20న పోలింగ్‌ నిర్వహిస్తారు.

230 సీట్లున్న మధ్యప్రదేశ్, 40 సీట్లున్న మిజోరంలో నవంబర్‌ 28న, 200 స్థానాలున్న రాజస్తాన్, 119 సీట్లున్న తెలంగాణలో డిసెంబర్‌ 7న పోలింగ్‌ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్‌ 11న వెల్లడిస్తారు. ఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచనాసదన్‌లో జరిగిన మీడియా సమావేశంలో కమిషనర్లు సునీల్‌ అరోరా, అశోక్‌ లావాసాతో కలసి ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్‌ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. తెలంగాణలో సీఎం కె.చంద్రశేఖర రావు అసెంబ్లీని 9 నెలల ముందే రద్దుచేయగా, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ గడువు జనవరి 5న ముగియనుంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ పదవీకాలం జనవరి 7న, మిజోరం శాసనసభ గడువు డిసెంబర్‌ 15న ముగియనున్నాయి. రాజస్తాన్‌ అసెంబ్లీకి జనవరి 20 వరకు గడువు ఉంది.

12.30కు బదులుగా 3గంటలకు..
మధ్యాహ్నం 12.30 గంటలకు జరగాల్సిన ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్‌ 3 గంటలకు వాయిదాపడటంపై విమర్శలు వచ్చాయి. రాజస్తాన్‌లో ప్రధాని మోదీ ర్యాలీ ఉన్నందునే ఆలస్యం చేశారని, మోదీ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందని ప్రతిపక్షాలు ఆరోపించడంపై రావత్‌ వివరణ ఇచ్చారు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని, కొన్ని అధికారిక పనుల వల్లే మీడియా సమావేశం రెండున్నర గంటలు ఆలస్యమైందని చెప్పారు. దీని వల్ల పలానా వర్గానికి అనుచిత లబ్ధి చేకూరిందని భావిస్తే, రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.

భాగస్వామ్య పక్షాలను సంతృప్తిపరచి, నిష్పాక్షికంగా, విశ్వసనీయతతో ఎన్నికలు నిర్వహించడం తమ బాధ్యత అని తెలిపారు. తెలంగాణ ఓటర్ల జాబితాపై నెలకొన్న సందిగ్ధత, భారీ వర్షాల ముప్పు నేపథ్యంలో ఉపఎన్నికను వాయిదావేయాలని తమిళనాడు కోరడం వల్లే ప్రెస్‌మీట్‌ కాస్త ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. ఎన్నికల సంఘం అధికారులు 5 రాష్ట్రాల్లో పర్యటించి, భాగస్వామ్య పక్షాలతో చర్చించారని, అంతా సిద్ధంగా ఉందని నిర్ధారించుకున్నాకే షెడ్యూల్‌ను విడుదలచేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు ఓటరు ధ్రువీకరణ రశీదు ఇచ్చే వీవీప్యాట్‌లను వినియోగిస్తామని చెప్పారు. ఈవీఎంలు, వీవీప్యాట్‌లను అవసరమైన మేరకు సమకూర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

మోదీ ఒత్తిడి వల్లే..
రాజస్తాన్‌లోని అజ్మీర్‌లో తన ర్యాలీకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్‌ ఆలస్యమయ్యేలా ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ఆరోపణల్ని తోసిపుచ్చుతూ ఈసీ ఇచ్చిన వివరణ అసంబద్ధంగా ఉందని పేర్కొంది. బీజేపీ సూపర్‌ ఈసీగా వ్యవహరిస్తోందని మండిపడింది. కోల్‌కతాలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మాట్లాడుతూ గతేడాది గుజరాత్‌ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ కూడా ఎన్నికల సంఘం ఇలాగే వ్యవహరించిందని ఆరోపించారు. ‘ ఇలాంటి వ్యూహాలు ఫలించవని బీజేపీ, ఈసీ గుర్తుంచుకోవాలి. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగరు. ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బీజేపీకి ఓటేయొద్దని ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో ఉప ఎన్నికలు
కర్ణాటకలో మూడు లోక్‌సభ స్థానాలకు నవంబర్‌ 3న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. షిమోగా, బళ్లారి, మాండ్యా స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 6న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ స్థానాల్లోని ఎంపీలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 5 లోక్‌సభ స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించబోమని ఈసీ స్పష్టం చేసింది.

నేర చిట్టా విప్పాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు సందర్భంగా గత నేరచరిత్రను వెల్లడించాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ వివరాలను సంబంధిత రాజకీయ పార్టీకి తెలియజేసినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించే అఫివిడవిట్‌లో డిక్లరేషన్‌ ఇవ్వాలి. రాజకీయ పార్టీలు ఎవరికైతే టిక్కెట్లు ఇస్తున్నాయో వారి గత నేర చరిత్ర వివరాల్ని పార్టీ వెబ్‌సైట్లో పొందుపరచాలని, ప్రతికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని స్పష్టం చేసింది. అఫిడవిట్‌ పార్ట్‌–ఏలోని ఫారమ్‌–26 ద్వారా అభ్యర్థులు తమ ఫోన్‌ నంబర్, ఈ–మెయిల్, సామాజిక మాధ్యమాల ఖాతాలు, ఆదాయ వనరుల వివరాలు వెల్లడించాలి. ఈ   నిబంధనలను త్వరలో వెల్లడిస్తామని తెలిపింది.

సీ–విజిల్‌తో కోడ్‌ ఉల్లంఘనలకు చెక్‌..
కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కోడ్‌ ఉల్లంఘన ఘటనలపై ప్రజలు ఈసీకి ఫిర్యాదుచేయొచ్చు. 5 నిమిషాల నిడివి గల వీడియోలను యాప్‌ ద్వారా చిత్రీకరించి పంపవచ్చు. ఫోన్‌లోని పాత వీడియోలను, ఫోటోలను యాప్‌ స్వీకరించదు. కోడ్‌ ఉల్లంఘన ఘటనల వీడియోలను ప్రత్యక్షంగా చిత్రీకరించి పంపాలి. వెంటనే ఓ గుర్తింపు నంబర్‌ వస్తుంది. ఇలా పంపిన వీడియోలు డిస్ట్రిక్‌ కంట్రోల్‌ రూంకు చేరుతాయి. అక్కడి నుంచి ఫ్లైయింగ్‌ స్క్వౌడ్‌ బృందాలకు చేరవేస్తారు. ఈ బృందాలు జియోగ్రాఫికల్‌ లోకేషన్‌ ఆధారంగా ఆ ప్రాంతానికెళ్లి దర్యాప్తుచేస్తారు. దీనిపై ఆ ప్రాంత రిటర్నింగ్‌ అధికారికి సమాచారమిచ్చి తదుపరి చర్యలు తీసుకుంటారు. గతంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై సరైన ఆధారాలు లేకపోవడం, అలాంటి ఘటనలు ఆలస్యంగా వెలుగుచూసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు చేపట్టింది.

ఫలితాల కోసం నెలరోజుల నిరీక్షణ..
ఛత్తీస్‌గఢ్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం ఆ రాష్ట్రంలో రెండు దఫాల్లో ఎన్నికలు నవంబర్‌ 12న, 20న జరుగుతాయి. ఫలితాల కోసం మాత్రం ప్రజలు డిసెంబర్‌ 11 వరకు ఎదురుచూడాల్సిందే. పోలింగ్‌ను ఐదు రాష్ట్రాల్లో వేర్వేరు దఫాల్లో నిర్వహిస్తున్నా ఫలితాల్ని ఒకేసారి ప్రకటించాలని ఈసీ నిర్ణయించడమే ఇందుకు కారణం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ రాజకీయ నేతలపై మావోయిస్టుల దాడి జరిగింది. మావోల ప్రాబల్యమున్న 18 స్థానాల్లో నవంబర్‌ 12న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం పోలీసు బలగాలను ఇక్కడ వినియోగించాల్సి వస్తున్నందున రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.


 

మరిన్ని వార్తలు