రూ.50 వేలు దాటితే.. రుజువు చూపాల్సిందే..

14 Jan, 2020 11:51 IST|Sakshi

మున్సిపల్‌ ఎన్నికల్లో రవాణా పరిమితి విధింపు

కరీంనగర్‌,కోరుట్ల: ‘మీరు మున్సిపల్‌ ఏరియాల్లో ఉంటున్నారా..? మీ అవసరాల కోసం రూ. 50 వేల కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళుతున్నారా..? కాస్త జాగ్రత్త పడండి.. ఆ డబ్బుకు చెందిన డ్రా చేసిన వివరాలు..బ్యాంకుకు చెందిన స్లిప్పులు వెంట ఉంచుకోండి...లేకుంటే మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో సదరు డబ్బు సీజ్‌ అయ్యే అవకాశముంది’.. మున్సిపాల్టీల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి అభ్యర్థుల అడ్డగోలు డబ్బు పంపిణీకి చేయడానికి చెక్‌ పెట్టేందుకు ఎన్నికల సంఘం ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చింది.

కాసుల పంపిణీకి చెక్‌
మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులకు కార్పొరేషన్‌లో రూ.1.50 లక్షలు, మున్సిపాల్టీల్లో రూ. లక్ష వ్యయం చేయడానికి వీలుంది. వీటికి సంబంధించిన లెక్కలు ప్రతీ రోజు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాల్టీల్లో ఆడిటర్లకు ప్రతీరోజు అప్పగించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి నేరుగా డబ్బు పంపిణీ చేయడానికి అవకాశమున్న క్రమంలో డబ్బు తీసుకెళ్లడానికి మున్సిపల్‌ ఎన్నికల చట్టం–2019 సెక్షన్‌ 226 ప్రకారం రూ.50 వేలు పరిమితిగా నిర్ణయించారు. ఈ పరిమితికి మించి డబ్బు ఎవరైనా తీసుకెళితే ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారో..ఎందుకు వాడుతున్నారో తెలపడంతోపాటు బ్యాంకు అకౌంట్‌ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. లేదంటే డబ్బు సీజ్‌కావడమే కాకుండా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

నిఘా టీంలు
మున్సిపాల్టీల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టకుండా నియంత్రించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. వీటిని ప్లయింగ్‌ స్క్వాడ్‌ ఫీల్డ్‌ పర్యవేక్షణ బృందం, స్థిర పర్యవేక్షణ బృందాలుగా పిలుచుకుంటున్నారు. ఈ బృందాల్లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకోసం నియమించిన సిబ్బందితోపాటు పోలీసు అధికారులు సభ్యులుగా ఉంటారు. మున్సిపాల్టీల్లోని జనాభా ప్రకారం ఈ బృందాలు ఏర్పాటు చేశారు. జగిత్యాల మున్సిపాల్టీల్లో ఐదు ప్లయింగ్‌ స్క్వాడ్‌కు, ఐదు స్థిర పర్యవేక్షణ బృందాలు ఐదు, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాల్టీల్లో మూడు చొప్పున ఆరు టీంలు, రాయికల్, ధర్మపురి మున్సిపాల్టీల్లో రెండు చొప్పున నాలుగు టీంలు ఏర్పాటు చేశారు.  

ఫిర్యాదు వస్తే..
మున్సిపల్‌ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులు..వారికి సంబంధించిన వ్యక్తులు డబ్బు పంచుతున్నారని ఫిర్యాదు వస్తే సదరు వ్యక్తి వద్ద రూ.50 వేలకు తక్కువగా రూ.10 వేలు ఉన్నా సదరు డబ్బు సీజ్‌ చేసే అవకాశముంది. సదరు వ్యక్తి పోటీలోని అభ్యర్థి తరఫున ఓటర్లకు డబ్బు పంచడానికి వెళుతున్నారా..లేదా ఇతర అవసరాల కోసం తీసుకెళుతున్నారా..? అన్న అంశాన్ని ప్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం నిర్ధారించుకున్న తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటారు. 

మరిన్ని వార్తలు