ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ఆదేశాలు

19 May, 2019 14:09 IST|Sakshi

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈరోజు సాయంత్రం 6.30 తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాలని, లేని పక్షంలో వీటిని ప్రసారం చేసిన వ్యక్తులు, మీడియా మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ‘ప్రజాప్రాతినిథ్య చట్టం 1951, సెక్షన్‌ 126(1) బి ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రసారాలు, ఎన్నికల ఫలితాలపై నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌, సర్వే వివరాలు.. ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రసారం చేయడం నిషిద్ధం’ అని నోటీసులో పేర్కొంది. అయితే నేటితో సార్వత్రిక సమరం ముగిసిన నేపథ్యంలో ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఏప్రిల్‌ 11న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికలు మే 19 ముగియనున్నాయి. దేశ వ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 11 ఉదయం 7 గంటల నుంచి మే 19 సాయంత్రం ఆరున్నర వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేయడం నిషిద్ధమని ఈసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఆదివారం చివరి విడత పోలింగ్‌లో భాగంగా చండీగఢ్‌ సీటుతో పాటు ఉత్తరప్రదేశ్‌(13), పంజాబ్‌(13), పశ్చిమబెంగాల్‌(9) బిహార్‌(8), మధ్యప్రదేశ్‌(8), హిమాచల్‌ప్రదేశ్‌(4), జార్ఖండ్‌(3) రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. కాగా ఎన్నికల తుది ఫలితాలు మే 23న వెల్లడికానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు