సాక్షి, ఎఫెక్ట్‌ : చిత్తూరు ఎస్పీపై ఈసీ సీరియస్‌! 

20 Mar, 2019 09:46 IST|Sakshi

ఎర్రావారిపాళెం ఎస్సైని ఎలా బదిలీ చేస్తారని నిలదీత 

ఆయన్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం 

టీడీపీ నగదు తరలింపునకు ఎస్కార్ట్‌ వ్యవహారంపై ఈసీ విచారణ 

చిత్తూరు ఎస్పీపై ఈసీకి ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫిర్యాదు 

సాక్షి, తిరుపతి రూరల్‌ : చిత్తూరు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహాం వ్యక్తంచేసింది. తమకు తెలీకుండా ఎర్రావారిపాళెం ఎస్సైను ఎలా బదిలీ చేస్తారని నిలదీసింది. బదిలీ కాదు అని ఎస్పీ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీస్‌స్టేషన్‌లో జనరల్‌ డైరీ (జీడీ) ఎస్పీ డ్రామాలను బట్టబయలు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు రిలీవ్‌ అవుతున్నట్లు ఎస్సై రాసిన జీడీని చూసిన ఈసీ, ఎన్నికల విధుల్లో పోలీస్‌ బాస్‌ పారదర్శకంగా లేరని నిర్ధారణకు వచ్చింది. వెంటనే ఎస్సైను తిరిగి విధుల్లోకి పంపించాలని ఆదేశించింది. ఈసీ ఆగ్రహాంతో ఎస్పీ దిగొచ్చి విధుల్లో చేరాలని ఎస్సై కృష్ణయ్యకు సూచించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు ఆయన తిరిగి విధుల్లోకి చేరారు. 

‘సాక్షి’ కథనంతో కదిలిన ఈసీ 
ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం ఎస్సై బదిలీపై ‘సాక్షి’ మెయిన్‌ పేపరులో మంగళవారం ‘ఎన్నికల కోడ్‌..డోంట్‌ కేర్‌’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. టీడీపీ నగదు తరలింపునకు ఎస్కార్ట్‌గా వెళ్లనందుకే ఎస్సైను బదిలీ చేశారని చిత్తూరు ఎస్పీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘సాక్షి’ కథనంపై ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది.  ఈసీ జరిపిన విచారణలో ఎస్సై కృష్ణయ్యను నిబంధనలకు విరుద్ధంగానే బదిలీ చేసినట్లు నిర్ధారించారు. టీడీపీ నగదు తరలింపుకు ఎస్కార్ట్‌ వ్యవహారాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. మదనపల్లి డీఎస్పీ మంగళవారం ఎర్రావారిపాళెం స్టేషన్‌కు వచ్చి విచారించారు. ఓ త్రిబుల్‌ స్టార్‌ అధికారి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, ఆయన ఉద్యోగాన్ని పణంగా పెట్టడమే కాకుండా, తమ ఉద్యోగాలను పణంగా పెట్టాలని బెదిరిస్తున్నారని.. ఆయన ఉంటే విధులను నిష్పక్షపాతంగా చేయలేమని  సిబ్బంది డీఎస్పీ వద్ద విన్నవించుకున్నట్లు సమాచారం.  

ఈసీకి ఫిర్యాదు చేసిన చెవిరెడ్డి.. 
చిత్తూరు ఎస్పీ ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించడంలేదని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తరçఫున న్యాయవాది వాణి కూడా ఎన్నికల సంఘానికి ఆధారాలతో మంగళవారం ఫిర్యాదు చేశారు. అర్థరాత్రి ఇళ్లలోకి వెళ్లి  వృద్ధులను, మహిళలపై దాడిచేయటం, అసభ్యంగా ప్రవర్తించటం, అక్రమ అరెస్టులపైనా బాధితులు కేంద్ర, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు, జాతీయ మహిళా కమిషన్‌లో ఫిర్యాదులు చేశారు. చిత్తూరు ఎస్పీపై ప్రైవేటు కేసులను సైతం నమోదు చేయించారు. ఎస్పీ నిష్పక్షపాతంగా వ్యవహరించటం లేదని ఈసీ నిర్ధారణకు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని కొనసాగిస్తారా? తప్పిస్తారా అన్నది వేచిచూడాల్సిందే.  

మరిన్ని వార్తలు